Yadadri KCR : తన పేరుని తానే గట్టిగా రాసేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఔను, యాదగిరిగుట్ట దేవస్థానం పేరుని యాదాద్రిగా మార్చి, లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని కనీ వినీ ఎరుగనంత గొప్పగా పునర్నిర్మించడం ద్వారా కేసీయార్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
దాదాపు 66 నెలలపాటు ఈ దేవాలయ పునర్నిర్మాణం జరిగింది. దీన్నొక యజ్ఞంలా కేసీయార్ భావించారు.. పూర్తి చేశారు. నీటి ప్రాజెక్టుల్ని ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించడం తెలిసిన విషయమే.
ఆ లెక్కన కాలేశ్వరం అనే మహా దేవాలయాన్ని కూడా కేసీయార్ తన హయాంలోనే మొదలు పెట్టి పూర్తి చేసెయ్యడం గమనార్హం.
అటు కాళేశ్వరం, ఇటు యాదాద్రి.. ఈ రెండూ వున్నంతకాలం కేసీయార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనేది నిర్వివాదాంశం. యాదాద్రి అయితే వందల ఏళ్ళపాటు చెక్కుచెదరని రీతిలో నిర్మించారు.
సినిమాలకు ఆర్ట్ డైరెక్టరుగా పనిచేసే ఆనంద్ సాయి నేతృత్వంలో ఆలయ ఆకృతుల్ని రూపొందించారు. కృష్ణ శిలను వినియోగించి కట్టడాల్ని పూర్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో నీటి సమస్య వస్తుందనీ, విద్యుత్ సమస్య వస్తుందనే విమర్శలు వచ్చాయిగానీ, వాటిని తెలంగాణ రాష్ట్రం అధిగమించిందంటే దానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రముఖ దేవాలయం తిరుపతి అయితే, ఆ స్థాయిలో యాదాద్రిని తెలంగాణలో తీర్చిదిద్దాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ సంకల్పం ఫలించింది. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం పూర్తయి.. భక్తులకు అందుబాటులోకి వచ్చింది.