పిఎంవో ఆరా..3 రాజధానులకు బ్రేక్ అంటూ ప్రచారం 

AP government
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశం మీద ఎంత పట్టుదలతో ఉందో అందరికీ తెలుసు.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమరావతిని నుండి రాజధానిని తరలించి మూడు భాగాలుగా ఏర్పాటు చేయాలని జగన్ భీష్మించుకు కూర్చున్నారు.  అమరావతి రైతులు ఎంత అడ్డుకోవాలని చూసినా ఆగడం లేదు.  ఇక ప్రతిపక్షం టీడీపీ అయితే శాసన సభ ఆమోదం పొంది గవర్నర్ వద్దకు వెళ్లిన బిల్లు ఆమోదం పొందే ఆస్కారమే లేదని అంటున్నారు.  మండలి ఆమోదం పొందలేదని, సెలెక్ట్ కమిటీ ముందు బిల్లు ఉందని, కోర్టులో కేసు నడుస్తోందని వాదిస్తున్నారు.  వారి అనుకూల మీడియా కూడా ఈ కారణాలను చూపుతూ బిల్లుకు బ్రేకులు పడుతాయని అంటోంది.  తాజాగా ప్రధాన మంత్రి కార్యాలయం మూడు రాజధానుల బిల్లు మీద ఆరా తీసిందని, బిల్లు ఆగుతుందని చెబుతోంది. 
 
పిఎంవో మూడు రాజధానుల బిల్లు మీద వివరాలు అడిగిన మాట వాస్తవమే.  అమరావతి జేఏసీ నేత, హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ శాస్ర్తి ఈ బిల్లుల అంశంపై ప్రధానమంత్రికి ఇటీవల లేఖ రాశారు.  ఆ లేఖకే పిఎంవో స్పందించింది.  సాధారణంగా పిఎంవోకు ఎవరు లేఖ రాసినా సమాధానం రావడం కామన్.  ఇక్కడ కూడ ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి రాసిన లేఖకు స్పందించిన పిఎంవో రెస్పాండ్ అవుతూ గవర్నర్ కార్యాలయాన్ని వివరాలు అడిగింది.  ఇంత మాత్రానికే ప్రధాని మూడు రాజధానుల బిల్లు మీద దృష్టి పెట్టారని, త్వరలో దానికి బ్రేకులు పడతాయనే ప్రచారం జరుగుతోంది.  
 
అంతేకాదు బిల్లుకి సంబంధించి మరిన్ని వివరాలను పిఎంవో ఆమరావతి జేఏసీని అడిగినట్టు వార్తలు వెలువడుతున్నాయి.  ఇందులో పెద్దగా నిజం ఉండకపోవచ్చు.  ఎందుకంటే పిఎంవోకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.  నిజంగానే పిఎంవో మూడు రాజధానుల బిల్లు మీద పూర్తి వివరాలు కావాలి అనుకుంటే రాజ్యంగబద్దంగా రాజ్ భవన్ నుండి వివరాలు తెప్పించుకుంటుంది.  లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అడుగుతుంది.  అంతేకానీ జేఏసీని వివరాలు అడగడం ఏమిటో మరి.  అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం చేసిన శాసన పరమైన నిర్ణయాలను ప్రధాని అడ్డుకోవడం అనేది జరగదు.  కానీ ప్రభుత్వ వ్యతిరేక మీడియా మాత్రం పిఎంవో మూడు రాజధానుల బిల్లును అడ్డుకునే ఆలోచనలో ఉందని ప్రచారం చేయడం ఒకింత ఓవర్ అనే అనుకోవాలి.