మునుగోడు ఉప ఎన్నికలో వైఎస్ షర్మిల పార్టీ పోటీ చేస్తుందా.?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల, మొన్నామధ్య హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తే, తమ పార్టీని బరిలోకి దింపకుండా తప్పించుకున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీని స్థాపించామని చెబుతున్న వైఎస్ షర్మిల, అందివచ్చిన అవకాశాల్ని మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.

తాజాగా మునుగోడు ఉప ఎన్నిక వస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ‘మాజీ’ అయ్యారు. ఆయన బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యర్థి వేటలో పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా అంతర్గత కుమ్ములాటలతో డీలా పడింది మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించింది.

ఇంతకు మించిన మంచి తరుణం బహుశా వైఎస్ షర్మిలకి ఇప్పట్లో రాకపోవచ్చు. ఎటూ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య రాజకీయ చీలిక వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానుల్లో ఎక్కువమంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి భక్తులున్నారు. ఆ లెక్కన మునుగోడు ఉప ఎన్నికలో గనుక వైఎస్సార్ తెలంగాణ పార్టీ బరిలోకి దిగితే, అది ఆ పార్టీకి బోల్డంత అడ్వాంటేజ్ అవుతుంది.

గెలవాల్సిన పనిలేదు, ఉనికిని చాటుకుంటే అదే చాలా చాలా గొప్ప విషయమవుతుంది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి. కాస్త రిస్క్ చేసి వైఎస్ షర్మిల పోటీ చేస్తే, కాలం కలిసొచ్చి షర్మిల గెలిస్తే.. తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్ రాత్రికి రాత్రి మారిపోయే అవకాశమూ లేకపోలేదు. అయితే, ప్రస్తుతానికి మునుగోడు ఉప ఎన్నికపై వైఎస్ షర్మిల వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
ఈ వ్యూహాత్మక మౌనం వైఎస్సార్ తెలంగాణ పార్టీ వెనకాల తిరుగుతున్న ఆ కొద్ది మంది వైఎస్సార్ అభిమానుల్నీ తీవ్రంగా కలచివేస్తోందిట.