ప్రజా ప్రస్థానం షర్మిలను అధికార పీఠమెక్కిస్తుందా.?

పాదయాత్ర అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, ఇప్పుడు రాజకీయాల్లో ఇదొక సరదా ట్రెండ్ అయిపోయింది. సుదీర్ఘ పాదయాత్ర.. అన్న మాటకు అర్థమే మారిపోయింది. అభిమాన నటీనటుల్ని చూసేందుకు వేల కిలోమీటర్ల దూరాన్ని చాలా తేలిగ్గా నడిచేస్తున్నారు సినీ అభిమానులు.

మరి, వైఎస్ షర్మిల పాదయాత్ర సంగతేంటి.? రేపు.. అంటే, అక్టోబర్ 20వ తేదీ నుంచి 400 రోజులపాటు సుమారు 4 వేల కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర చేయబోతున్నారు. ఉదయాన్నే 8.30 నిమిషాలకు మొదలయ్యే పాదయాత్ర మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత లంచ్ బ్రేక్. మళ్ళీ మూడున్నర గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాదయాత్ర కొనసాగుతుందట.

అంటే, రోజులో దాదాపు ఏడు గంటలపాటు ఈ పాదయాత్ర జరుగుతుంది. ఏడు గంటలు.. దాదాపు పది కిలోమీటర్లు.. ఇదీ లెక్క. ప్రతి మంగళవారం, పాదయాత్ర ఎక్కడ కొనసాగుతుంటే, అక్కడ నిరుద్యోగ దీక్షను షర్మిల చేపడతారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ వర్గాలు అంటున్నాయి.

షర్మిల గతంలోనూ పాదయాత్ర చేశారు.. అయితే, అది అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం. ఇప్పుడు తనకోసం ఆమె ఈ ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వాన్ని తీసుకుని, అధికారాన్ని కూడా సొంతం చేసుకోవాలన్న కోణంలో ఈ పాదయాత్రల్ని అటు వైఎస్ జగన్, ఇటు షర్మిల చేశారనీ, చేస్తున్నారనీ అనుకోవచ్చు.

పాదయాత్రలు చేస్తే అధికారమొచ్చేయదు.. ప్రజలకు మంచి చేస్తామన్న నమ్మకం కలిగించగలగాలి.. అని పాదయాత్రపై ఇటీవలే షర్మిల వ్యాఖ్యానించారు. మరి, ఆ నమ్మకం ప్రజల్లో షర్మిల కలిగించగలుగుతారా.? జస్ట్ వెయిట్ అండ్ సీ.