Jana Sena : మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ఈ సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభ నిర్వహణకు సంబంధించి పార్టీ తరఫున ప్రత్యేకంగా కొందరు బాద్యుల్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు కూడా.
ఎప్పుడో 2014 ఎన్నికలకు ముందు పుట్టిన జనసేన పార్టీ, అప్పటినుంచి ఇప్పటిదాకా నిఖార్సయిన రాజకీయ పార్టీగా ఎదిగేందుకు తంటాలు పడుతూనే వుంది. నిజానికి, ఓ పదో, పాతికో సీట్లు తెచ్చుకునే స్థాయి అయితే జనసేన పార్టీకి వున్నా, ఎందుకో జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకున్న ఏ ఒక్క అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోలేకపోతోంది.
జేడీ లక్ష్మినారాయణ లాంటి వ్యక్తులే జనసేనలో ఇమడలేకపోయారు. బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే క్రమంలో జనసేన పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోకపోవడమే అసలు సమస్య. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయినా.. తద్వారా ఏర్పడ్డ లోటుని జనసేన పూడ్చలేకపోతోంది.
ఈ నేపథ్యంలో జనసేన ఆవిర్భావ సభ సందర్బంగా జనసైనికులు పార్టీ అధినాయకత్వం నుంచి చాలా చాలా ఆశిస్తోంది. పలువురు టీడీపీ నేతలు, అలాగే వైసీపీ నేతలు కూడా జనసేనాని సమక్షంలో వైసీపీలో మార్చి 14న నిర్వహించే సభలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ విషయమై జనసైనికులు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే, ఇందులో నిజమెంత.? అన్నది మాత్రం ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.