తెలంగాణలో ప్రస్తుతం వైఎస్ షర్మిల పార్టీ (వైఎస్సార్ తెలంగాణ పార్టీ) పరిస్థితేంటి.? అంటే, ప్చ్.. ఏమీ లేదనే చెప్పాల్సి వుంటుంది. షర్మిల పార్టీ పట్ల ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవు. అసలు ఆ పార్టీలో వున్న నాయకులెవరో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం తరఫునే అప్పుడప్పుడూ ఏదో ఒక యాక్టివిటీ నడిచేది, దానికి వైసీపీ అనుకూల మీడియాలో ప్రాచుర్యం దక్కేది. కానీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ విషయంలో అలాంటిదేమీ జరగడంలేదు. వైఎస్ విజయమ్మ ఇటీవల, షర్మిల పార్టీ కోసం హైద్రాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని వైఎస్సార్ వర్ధంతి రోజున చేపట్టిన విషయం విదితమే. కానీ, ఆ కార్యక్రమం వల్ల వైఎస్ షర్మిల పార్టీకి అస్సలు ఒరిగిందేమీ లేదు. షర్మిల పార్టీ వున్నపళంగా పొలిటికల్ మైలేజ్ పొందాలంటే, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ఆ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి వుంటుంది. పోటీ చేసినంతమాత్రాన వైఎస్సార్ తెలంగాణ పార్టీ గెలిచేస్తుందని కాదు.
కనీసం, హుజూరాబాద్ నియోజకవర్గంలో వైటీపీ (వైఎస్సార్ తెలంగాణ పార్టీ) జెండాలు కొన్నయినా కనిపిస్తాయి. వైఎస్ షర్మిల వ్యూహాలు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలా వున్నాయోగానీ, వైఎస్సార్ అభిమానులు మాత్రం.. షర్మిల పార్టీ తీరుతెన్నులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. తెలంగాణలోనూ వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలోనే వున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ పథకాల ద్వారా లబ్ది పొందినవారెవరూ వైఎస్సార్‌ని మర్చిపోలేరు. ఆ ఓట్లు ఇంకెవరికీ వెళ్ళేవీ కావన్న అభిప్రాయం చాలామందిలో బలంగా వుంది. కానీ, ఆ ఓటు బ్యాంకునీ చూపించేకోలేకపోవడమంటే అది అసమర్థతే అవుతుంది. మరి, షర్మిల పార్టీ ఈ విషయంలో పునరాలోచన చేస్తుందా.? చేస్తే పార్టీకి ఊపు వస్తుంది. లేదంటే, అంతే సంగతి.