ప్రశాంత్ కిషోర్.. దేశ రాజకీయాల్లో ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే, కాస్త రాజకీయ పరిజ్నానం వున్నవారెవరికైనా ఈయన పేరు ఇట్టే తెలిసిపోతుంది. వివిధ రాజకీయ పార్టీలకు ‘గెలుపు వ్యూహకర్త’గా పనిచేసి, ఆయా రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పార్టీలు గెలవడానికి కారణమయ్యారు ప్రశాంత్ కిషోర్. ఇటీవల తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎంత గొప్పగా పనిచేసి, అక్కడ ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్న పార్టీలు ఎంత మంచి విజయాల్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే.
ఆ రెండు రాష్ట్రాల ఫలితాల తర్వాత, తాను ఇకపై ఎవరికీ రాజకీయ వ్యూహకర్తగా పనిచేయబోనని ప్రకటించారు ప్రశాంత్ కిషోర్. అంతలోనే, తెరవెనుక ఆయన మళ్ళీ రాజకీయ మంతనాల్లో నిమగ్నమైపోయారు. గతంలో బీజేపీ తరఫున.. అందునా నరేంద్ర మోడీ తరఫున పనిచేసిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేయబోతున్నారు.
ఈ క్రమంలో దేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ పార్టీలన్నిటినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. అలా దేశంలో నరేంద్ర మోడీకి రాజకీయ ప్రత్యర్థిగా ఎదగాలనే ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారా.? అన్న అనుమానాలు కలగకమానవు ఎవరికైనా. అయితే, తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారీయన. ఐ ప్యాక్ అనే సంస్థ ద్వారా కోట్లాది రూపాయల మేర డీల్స్ కుదుర్చుకుని, ఆయా పార్టీల్ని గెలిపించడం ప్రశాంత్ కిషోర్ అసలు పని. వందల కోట్లు ప్రతి ఎన్నికల్లోనూ ఆయన కొల్లగొడుతుంటారనే వాదన వుంది.
ఆ సంపాదన మానుకుని, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం సాధ్యమేనా.? అన్నది ఇంకో చర్చ. అయితే, ప్రతిసారీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనిచేస్తాయనుకోలేం. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకుని, గెలిచే పార్టీల వైపు నిలబడటం ద్వారా తన సక్సెస్ రేట్ పెంచుకున్నారు ప్రశాంత్ కిషోర్. అంతే తప్ప, ఆయన ఎవర్నయినా గెలిపించేయగలరనుకుంటే అది పొరపాటే అవుతుంది.