రాజకీయాల్లోకి నయనతార రాబోతోందా.? నిజమెంత.?

నో డౌట్, నయనతార అంటే లేడీ సూపర్ స్టార్. తమిళ సినీ పరిశ్రమలో ఆమెకున్నంత ఫాలోయింగ్ ఇంకే ఇతర హీరోయిన్‌కీ లేదన్నది నిర్వివాదాంశం. హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ తమిళనాడులో ఎవరన్నా వుంటే అది నయనతార మాత్రమే. ఏదన్నా సినిమాకి నయనతార కమిట్ అవ్వాలంటే, ముందుగా నయనతార రెమ్యునరేషన్ ఫిక్సవ్వాల్సి వుంటుంది. ఆ తర్వాతే సినిమా బడ్జెట్ వంటి వ్యవహారాలుంటాయట.

సరే, ఆ సంగతి పక్కన పెడితే, తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో చాలాకాలంగా నడుపుతున్న ప్రేమాయణాన్ని ఎట్టకేలకు నయనతార, పెళ్ళి పీటల వరకూ తీసుకెళ్ళింది. నిన్ననే ఈ ఇద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పటిదాకా వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, నయనతార రాజకీయాల్లోకి రాబోతోందంటూ తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు నయనతారకి వల వేస్తున్నాయి. తమిళనాడులో సినీ తారలు రాజకీయాల్లోకి రావడమే కాదు, రాజకీయాల్ని శాసించిన పరిస్థితుల్ని చూశాం. అయితే, ఒకప్పటి పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు భయపడుతోంటే, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చి సాధించిందేమీ లేదు. విజయ్ కాంత్ కూడా అంతే. శరత్ కుమార్ తదితరులూ రాజకీయ తెరపై మెరవలేకపోతున్నారు. ఖుష్బూ కూడా రాజకీయాల్లో డోలాయమానంలోనే వున్నారు.

ఈ పరిస్థితుల్లో నయనతార రాజకీయాల్లోకి వచ్చేంత పిచ్చి పని ఎందుకు చేస్తుంది.? అన్నది ఆమె అభిమానుల వాదన. కానీ, ఆమె సినీ గ్లామర్ చాలా రాజకీయ పార్టీలకు అవసరంగా కనిపిస్తోంది.