Narayana : పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్టవడం, ఆ తర్వాత ఆయనకు బెయిల్ రావడం అన్నీ నాటకీయంగా సాగిపోయాయి. రాజకీయాల్లో నేతల అరెస్టులు, ఆ తర్వాత కేసుల విచారణలో జాప్యం.. ఇదంతా ఓ పెద్ద ప్రసహనం.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సహజాతి సహజం. మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహారంలోనూ ఈ కక్ష సాధింపుల అంశం చర్చకు వచ్చింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తూనే, నారాయణ సంస్థలతో అనుబంధాన్ని తెంచేసుకున్నట్లు నారాయణ ప్రకటించారు. ఇది ఇప్పటి మాట కాదు.
మరి, నారాయణ విద్యా సంస్థల అధినేతగా నారాయణను ఎలా అరెస్టు చేస్తారు.? సాధాణంగానే చాలామందికి కలిగే అనుమానం ఇది. అధికారంలో వున్నోళ్ళకి ఇదంతా తెలియదా.? తెలిసీ, నారాయణకు ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశముందని ఎలా నమ్ముతారు.?
న్యాయస్థానానికి కావాల్సింది సాక్ష్యాలూ, ఆధారాలు. తనకు నారాయణ విద్యా సంస్థలతో సంబంధం లేదని తేలిగ్గానే నారాయణ మెజిస్ట్రేట్ ముందు వాదించగలిగారు. ఈ క్రమంలో ఆయనకు బెయిల్ వచ్చేసింది. వాట్ నెక్సట్.? నారాయణను సూత్రధారిగా చూపేందుకు తమ వద్ద ఆధారాలున్నాయన్న పోలీసులు, అదెందుకు మెజిస్ట్రేట్ ముందు నిరూపించలేకపోయినట్టు.?
ఒక్కటి మాత్రం నిజం. బెయిల్ వచ్చినంత మాత్రాన నారాయణ నిర్దోషి అని కాదు. ఇప్పటికీ ఆయన నిందితుడే. కేసు విచారణ జరుగుతుంది.. సరైన ఆధారాలు దొరికితే, నారాయణ నేరస్తుడిగా నిరూపితమవుతారు. కానీ, దానికి ఎంత సమయం పడుతుంది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.