తెలుగు సినీ పరిశ్రమై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం విదితమే. కౌంటర్ ఎటాక్‌కి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా దిగుతోందిట. తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణలో అసలు వుండదన్న చర్చ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ – సమైక్య ఉద్యమాల నేపథ్యంలో జరిగిన విషయం విదితమే.
కానీ, తెలంగాణ వచ్చాక.. తెలంగాణలో తెలుగు సినీ పరిశ్రమ వెలుగులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాంటి ఆటంకాలూ కలిగించలేదు సరికదా, ‘మీకెలాంటి సాయం కావాలన్నా చేస్తాం..’ అంటూ సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీయార్, తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద భరోసానే ఇచ్చేశారు.
దాదాపుగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులంతా తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగానే వుంటున్నారు. ఎప్పుడైతే బీజేపీ, తెలుగునాట సినీ రాజకీయం షురూ చేసిందో, గులాబీ పార్టీ కూడా అప్రమత్తమవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీయార్.. తెలుగు సినీ ప్రముఖులతో వరుస భేటీలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారట.
కేటీయార్‌కి మహేష్, రామ్ చరణ్.. ఇలా దాదాపు యంగ్ హీరోలందరితోనూ సన్నిహిత సంబంధాలున్నాయ్. చిరంజీవి, నాగార్జున తదితర సీనియర్ హీరోలతనూ కేసీయార్ అవే తరహా సన్నిహిత సంబంధాల్ని కొనసాగిస్తున్నారు. ఒకవేళ కేటీయార్ స్వయంగా రంగంలోకి దిగితే, అది తెలంగాణ రాష్ట్ర సమితికి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది.
‘పరిశ్రమ బాగు కోసం అవసరమైన చర్యలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటోంది.. పరిశ్రమ ప్రముఖులు తెలంగాణ రాష్ట్రానికి అండగా వుంటారనే అనుకుంటున్నాం..’ అని పదే పదే టీఆర్ఎస్ నేతలు చెబుతూ వస్తోన్న విషయం విదితమే.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, విజయదశమి తర్వాత మహేష్‌తో కేటీయార్ భేటీ జరుగుతుందనీ, ఆ తర్వాత వరుసగా సినీ ప్రముఖులతో కేటీయార్ సమావేశాలు నిర్వహిస్తారనీ తెలుస్తోంది. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.