Jagan And BJP : టీడీపీ – బీజేపీ మధ్య రాజకీయ దోస్తీ వున్నప్పుడు, ఏపీకి చెందిన ఓ రాజ్యసభ సీటుని ఏపీకి చెందని బీజేపీ నేత సురేష్ ప్రభుకి ఇచ్చిన విషయం విదితమే. చంద్రబాబు దాణగుణం సంగతెలా వున్నా, రాష్ట్రానికి దక్కాల్సిన ఆ సీటుని రాష్ట్రానికి చెందని వ్యక్తికి ఇవ్వడంపై చాలా విమర్శలొచ్చాయి.
అయితే, రాజకీయాల్లో ఇలాంటివి మామూలే. వెంకయ్యనాయుడు కర్నాటక నుంచి రాజ్యసభకు పని చేశారు. జీవీఎల్ నరసింహారావు కూడా వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ అయి వున్నారు. జాతీయ పార్టీ లెక్క వేరు, ప్రాంతీయ పార్టీల లెక్కలు వేరు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక, బీజేపీ కోసం రాష్ట్రానికి సంబంధం లేని పరిమల్ నత్వానీ అనే వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘బీజేపీకి వైఎస్ జగన్ అలా కప్పం కట్టారు..’ అనే విమర్శలు అప్పట్లో వచ్చాయి.
మళ్లీ ఇంకోసారి వైఎస్ జగన్ అలాంటి ‘త్యాగం’ చెయ్యక తప్పేలా లేదు.
రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాటిల్లో విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి నియామకం దాదాపు ఖాయమైపోయింది. విజయసాయిరెడ్డికి మరోమారు రాజ్యసభ దక్కనుంది.
నాలుగో వ్యక్తి విషయమై బీజేపీ పెద్దలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంతనాలు జరపనున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
బీజేపీతో అత్యంత సాన్నిహిత్యం వున్న అదానీ క్యాంపులో ఎవరో ఒకరికి ఏపీ నుంచి రాజ్యసభ సీటుని వైఎస్ జగన్ ఇవ్వబోతున్నారన్నది తాజా ఖబర్. ఇదెంత నిజం.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.
ఇస్తే మాత్రం, బీజేపీకి వైఎస్ జగన్ రాజకీయ కప్పం కడుతున్నట్లే భావించాలన్నది మెజార్టీ అభిప్రాయం.