YSRCP : ఉద్యోగుల్ని రెచ్చగొట్టి ఏం సాధిస్తారు.?

YSRCP :  పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికీ, ఉద్యోగులకీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కొందరు మంత్రులు, చీఫ్ సెక్రెటరీ తదితరులు ఉద్యోగుల తీరుని తప్పు పడుతున్నారు. ప్రభుత్వం తన ఉద్దేశాల్ని చెప్పడం, ఉద్యోగులు తమ సమస్యల గురించి నినదించడం.. అన్నది సహజంగా జరిగే విషయమే.

కానీ, అధికార వైసీపీ, ‘కామన్ మ్యాన్’ పేరుతో ఉద్యోగులపై విషం చిమ్మే కార్యక్రమాలు ఎందుకు చేస్తోందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార మీడియాలో, ఉద్యోగులపై రాజకీయ విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇది వైసీపీ ప్రభుత్వానికి అస్సలేమాత్రం మంచిది కాదు.

సరే, లక్షలాది మంది ఉద్యోగుల్లో ఒకరిద్దరు సంయమనం కోల్పోతే, దాన్ని ఉద్యోగులందరికీ అంటగట్టడం ఎంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ. ఉద్యోగులంటే విద్యాధికులు, ప్రభుత్వంలో ఏం జరుగుతోందో బాగా తెలిసినవాళ్ళు. ఖర్చులు, రాబడి వంటి విషయాలపై ఉద్యోగులకు సంపూర్ణ అవగాహన వుంటుంది.

ప్రభుత్వం, ఉద్యోగులతో చర్చలకు సిద్ధమంటోంది. ఉద్యోగులు వద్దంటోన్న పీఆర్సీని బలవంతంగా అమలు చేసేసి, ‘పనైపోయింది, వెనక్కి తగ్గే అవకాశం లేదు..’ అనడం ఎంతవరకు సబబు.? అన్న విషయమై ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేయాల్సి వుంది.

ఇంకోపక్క, ఉద్యోగులు బల ప్రదర్శనతో సాధించేది ఏమీ వుండదు. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రం పట్ల ఉద్యోగులూ బాధ్యతతో వ్యవహరించాల్సి వుంది. లేనిపక్షంలో, ఉద్యోగులకు ప్రజా వ్యతిరేకత తప్పదు. అదే సమయంలో ప్రభుత్వం కూడా, ఉద్యోగులకు వ్యతిరేకంగా చేపట్టే చర్యలతో ప్రజల్లో పలచనైపోతుంది.

అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులు కలిసి సమస్య పరిష్కారం కోసం పనిచేయాల్సింది పోయి, ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలనుకోవడం సబబు కాదు. ఈ మొత్తం వ్యవహారంలో, వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వంలో వున్నవారు, తమ పార్టీ శ్రేణుల్ని అదుపు చేయలేకపోవడమటే, అది ‘అసమర్థత’ అవుతుంది.