భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళేవారికి వ్యాక్సినేషన్ విషయమై కొంత గందరగోళం వుంది. కోవిషీల్డ్ టీకా తీసుకుంటే విదేశీ ప్రయాణాలకు ఇబ్బందులుండవని చాలామంది నమ్మారు. కానీ, కొన్ని దేశాల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నవారికీ ఇబ్బందులు తప్పడంలేదు.
ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజలకు సరైన స్పష్టతనివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కోవాగ్జిన్ విషయమై ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణీకులకు ఇబ్బందులున్న సంగతి తెలిసిందే. మరి, విదేశాల్లో అనుమతులు పొందిన వ్యాక్సిన్లను ఎందుకు భారతదేశం దిగుమతి చేసుకోలేకపోతోంది.? ఫైజర్, మోడెర్నా టీకాలు ఎప్పటినుంచో భారతదేశంలో అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి.
తాజాగా మోడెర్నా టీకా దిగుమతికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. కానీ, ఫైజర్ వ్యాక్సిన్ విషయంలో గందరగోళం అలాగే కొనసాగుతోంది. ఎందుకీ జాప్యం.? అన్నదానిపై కేంద్రం వద్ద సరైన సమాధానం వున్నట్లు కనిపించడంలేదు. స్పుత్నిక్ వ్యాక్సిన్ దేశంలో వినియోగానికి అనుమతి పొందినా, రావాల్సిన స్థాయిలో వ్యాక్సిన్లు దేశంలోకి రావడంలేదు.
దేశంలో ఉత్పత్తి కూడా జరగడంలేదు. 130 కోట్ల మందికి పైగా జనాభా వున్న భారతదేశంలో వ్యాక్సిన్లు పెద్దయెత్తున అవసరమవుతాయి. అందుకు తగ్గ ప్రణాళిక మాత్రం కేంద్రం వద్ద కొరవడుతోంది. స్పుత్నిక్, మోడెర్నా తదితర టీకాలని భారతదేశంలో తయారు చేసి, కొన్ని వినియోగించి, కొన్ని విదేశాలకు ఎగుమతి చేస్తే.. రెండు రకాలుగా దేశానికి లాభం వుంటుంది. అయినా, మోడీ సర్కార్ ఈ విషయమై ఎందుకంత శ్రద్ధ పెట్టలేకపోతోందన్నది అందర్నీ విస్మయానికి గురిచేస్తోన్న అంశం.