నారా లోకేష్ టూర్‌పై ఇంత అత్యుత్సాహమెందుకు.?

మాజీ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా పర్యటన కోసం వెళ్ళారు. ఈ క్రమంలో ముందుగానే రాజకీయంగా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు షురూ అయ్యాయి. ఓ ప్రజా ప్రతినిథి, తాను వెళ్ళాలనుకున్న చోటకి నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. ‘నారా లోకేష్ పర్యటనకి అనుమతి లేదు..’ అని పోలీసులు ముందుగానే ప్రకటించడం ఓ ఆశ్చర్యకరమైన విషయం. పర్యటనకు సంబంధించి జనసందోహం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రమే పోలీసు వ్యవస్థ మీద వుంటుంది. ‘నేనేమీ ధర్నా చేయడానికి వెళ్ళడంలేదు.. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నాను..’ అని నారా లోకేష్ అంటున్నారు. ఇందులో నారా లోకేష్‌ని తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా లోకేష్ టూర్ విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

అయితే, గత కొంతకాలంగా పోలీసులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. న్యాయస్థానాల యెదుట పోలీసు ఉన్నతాధికారులు ‘చేతులు కట్టుకుని నిల్చోవాల్సిన’ పరిస్థితి వస్తుందంటే, అవి నిర్ణయాల్లో లోపాల కారణంగానే. విజయవాడలో ఓ సినీ నటుడి కార్యక్రమానికి ఎలాంటి ఆంక్షలూ లేవు. సదరు సినీ నటుడి పర్యటన ఈ రోజే జరిగింది. పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయన వెంట కనిపించారు. మరి, నారా లోకేష్ విషయంలో పోలీసులెందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు.? నారా లోకేష్‌ని కారు నుంచి దించేందుకు పోలీసులు నానా పాట్లూ పడ్డారు. ఈ క్రమంలో ‘నన్ను తాకడానికి వీల్లేదు. నా మీద దౌర్జన్యం చేస్తామంటే కుదరదు..’ అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చేశారు నారా లోకేష్. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది.? అన్నదానిపై పోలీసు వ్యవస్థ ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది. పదుల సంఖ్యలో పోలీసులు నారా లోకేష్ కాన్వాయ్ వెంట ఇరువైపులా నడవడం పోలీసు వ్యవస్థకు చిన్నతనం.. అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.