అచ్చెన్నా.. కేంద్రాన్ని ప్రశ్నించరేం.?

దేశంలో పెట్రోల్ ధర సెంచరీ కొట్టేసిందంటే, ఆ పాపం ఎవరిది.? ఇంకెవరిది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానిదే. ఎడాపెడా పన్నులు పెంచేసి, పెట్రోల్ ధరని సెంచరీ దాటించేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ పాపంలో రాష్ట్రాలకీ వాటా వుంది. కొన్ని రాష్ట్రాలు పెట్రో పన్నులు కాస్త తగ్గించి, వినియోగదారులకు ఊరటనిచ్చాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. కరోనా ఆర్థిక కష్టాల్ని ఇందుకు సాకుగా చూపిస్తున్నాయి ప్రభుత్వాలు. ధనిక రాష్ట్రం తెలంగాణ కూడా పన్నుల్ని తగ్గించడానికి సుముఖత వ్యక్తం చేయడంలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చి చూసినప్పుడు తెలంగాణలో పెట్రోల్ ధర కాస్త తక్కువే. ఇక, పెట్రో ధరల విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ‘మా హయాంలో 80 దాటలేదు పెట్రోల్ ధర.. మీరిప్పుడు 100 దాటించేశారు..’ అంటూ వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ విరుచుకుపడిపోతోంది.

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడైతే ఒకింత సంయమనం కోల్పోయి.. ఎడాపెడా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడిపోతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. కానీ, ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వాన్నే కాదు.. దేశాన్ని నడిపిస్తోన్న మోడీ ప్రభుత్వాన్ని కూడా ఈ విషయమై ప్రశ్నించాలన్న కనీసపాటి ఇంగితాన్ని అచ్చెన్న సహా టీడీపీ నేతలంతా విస్మరిస్తున్నారు. ఇంకా నయ్యం.. మోడీ సర్కారుని విమర్శిస్తే, టీడీపీకి పుట్టగతులుంటాయా.? అదీ అచ్చెన్న అండ్ టీమ్ భయం. ‘మీరు మాత్రం, మేం అధికారంలో వున్నప్పుడు మమ్మల్ని ప్రశ్నించారు తప్ప, కేంద్రాన్ని నిలదీయలేదు కదా..’ అంటూ వైసీపీ మీద టీడీపీ ఎదురుదాడికి దిగుతుండడం చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలది.