యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిస్తే ఏమైపోతుంది.? మొన్నీమధ్యనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. అప్పుడేమయ్యింది.? ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీయార్, అమిత్ సా భేటీ తర్వాత ఏం జరగబోతోంది.?
రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. రాజకీయ నాయకులు రాజకీయాల గురించే ఆలోచిస్తారు. ఇందులో వింతేమీ లేదు. కాకపోతే, రాజకీయం సినిమాటిక్‌గా మారిపోయింది. అదే సమస్య. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అనేది పెద్ద విషయమేమీ కాదు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా అనేది అంత పెద్ద అంశం కూడా కాదు.! ఇలా తయారైంది వ్యవహారం.
ఎన్టీయార్ – అమిత్ షా భేటీ తర్వాత రాజకీయ సమీకరణాలు ఎలా వుంటాయన్నదానిపై బోల్డంత చర్చ జరుగుతోంది. నిజానికి, చర్చ జరగాల్సింది ఆ కోణంలో కాదు. సినీ పరిశ్రమకు ఈ భేటీ వల్ల ఏం లాభం.? తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి పరంగా ఈ భేటీ వల్ల ఏమైనా ఉపయోగం వుంటుందా.? లేదా.?
బీజేపీ, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం వున్న అవకాశాలన్నిటినీ తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది. లేని అవకాశాల్ని కల్పించుకోవడానికీ ప్రయత్నిస్తోంది. ఇంతే, ఇంతకు మించి ఇంకేమీ లేదు. తెలుగు రాష్ట్రాల పట్ల, దేశం పట్ల బీజేపీకి బాధ్యత లేకుండా పోయిందన్న విమర్శల్లో నిజం లేకపోలేదు.
ఆఖరికి, సినిమా విషయంలో ఎన్టీయార్‌ని అభినందించేందుకు అమిత్ షా ఓ భేటీ నిర్వహిస్తే, దాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే స్థాయికి బీజేపీ దిగజారిపోయిందంతే.!