కరోనా విపత్తు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడుతోన్న విషయం విదితమే. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మాట్లాడారు, ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై వాకబు చేశారు. కాగా, జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ మాత్రం, ప్రధాని ఆరా తీయడంపై విమర్శలు చేశారు సోషల్ మీడియా వేదికగా. ప్రధాని తన మనసులో మాట చెప్పారు, ఇట్నుంచి చెప్పే విషయాల్ని అర్థం చేసుకోవడానికీ ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని సోరెన్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం రాజకీయంగా పెను దుమారం రేపింది.
దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఈ సమయంలో విమర్శలు చేయడం తగదంటూ ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్వీటుకి ఘాటైన సమాధానమిచ్చారు. నిజానికి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీ నేత కాదు. బీజేపీ నేతలు సైతం, ప్రధానిని వెనకేసుకొస్తూ ఇలాంటి ట్వీట్లు చేయలేదనీ, వైఎస్ జగన్ ఎందుకు అలా స్పందించారని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది. అయితే, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశ పౌరుడిగా వైఎస్ జగన్, అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించారన్నది మరికొందరి వాదన. షరామామూలుగానే, టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ప్రచారానికి వైఎస్ జగన్ వెళ్ళకపోవడానికి కారణం కూడా మోడీ మీద భక్తి ప్రధాన కారణమని.. టీడీపీ మద్దతుదారులు సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. అయినా, ఈ విషయంలో వైఎస్ జగన్ తొందరపడి స్పందించారనుకోవాలేమో. జార్ఖండ్ రాష్ట్రంలో సమస్యలేంటో.. అక్కడ కరోనా విషయమై కేంద్రం చర్యలేంటో తెలుసుకోకుండా జగన్ అనవసరంగా జగన్ స్పందించారేమో.