2014 నుంచి 2019 వరకు ఆంధ్రపదేశ్‌లో అధికారంలో వున్నది తెలుగుదేశం పార్టీ. ఆ లెక్కన, రాష్ట్రంలో దోపిడీ జరిగినా, అభివృద్ధి జరగకున్నా.. దానికి నైతిక బాధ్యత వహించాల్సింది టీడీపీనే. ఆ అంశాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తిరుపతి పర్యటనలో ఎక్కడా ప్రస్తావించలేదు. టీడీపీ అసలు తమకు పోటీనే కాదని జనసేన – బీజేపీ కూటమి భావిస్తోంది గనుక.. అనే కుంటి సాకు ఆ రెండు పార్టీలూ చెప్పదలచుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. జనసేనాని తిరుపతి పర్యటన, కేవలం అధికార వైసీపీని విమర్శించడానికే అన్నట్టుంది. వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులు.. దాంతోపాటుగా వైఎస్ వివేకా హత్య.. వంటి అంశాల గురించి జనసేనాని ప్రశ్నించారు. ఇక్కడి వరకూ బాగానే వుంది.. వైఎస్ వివేకా హత్య చంద్రబాబు హయాంలో జరిగింది. ఆలయాలపై దాడులనేవి చంద్రబాబు హయాంలో కూడా జరిగాయి. ఇవన్నీ పక్కన పెడితే, ప్రత్యేక హోదా.. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ.. ఇవి కదా అత్యంత కీలకమైన అంశాలు.
వీటి గురించిన చర్చ ఎందుకు పవన్ ప్రసంగంలో రాలేదు.? ఎందుకొస్తుంది.? రాష్ట్రానికి అన్యాయం చేస్తోన్న బీజేపీ తరఫున వకీల్ సాబ్ వకాల్తా పుచ్చుకున్నారు మరి. పాచిపోయిన లడ్డూల వ్యవహారం దగ్గర్నుంచి చాలా అంశాలపై జనసేన అధినేత వివరణ ఇచ్చుకోవాల్సి వుంది. కానీ, ఇవ్వరు. ఎందుకంటే, తిరుపతిలో జనసేన పోటీ చేయడంలేదు. కేవలం ఓ స్టార్ క్యాంపెయినర్‌గా తన పని తాను చేసుకుపోయారు పవన్ కళ్యాణ్. దీన్ని ఓ పొలిటికల్ టూర్‌లా కాదు, కేవలం తన సినిమా ప్రచారం కోసం.. అన్నట్టుగా పవన్ వాడుకున్నట్లే కనిపించింది. పలువురు బీజేపీ నేతలు కూడా ‘వకీల్ సాబ్’ ప్రమోషన్ కోసం అత్యుత్సాహం చూపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన పవన్ కల్యాణ్‌లో ఏమాత్రం వున్నా.. ఆయన కాస్తంత బాధ్యతగా వ్యవహరించాలి. అది ఆయన్నుంచి ఆశించగలమా.?