జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిన ప్రజారాజ్యం పార్టీ పేరుని వీలు చిక్కినప్పుడల్లా ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు.? చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించి దాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన విషయం విదితమే. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్యాకేజీ తీసుకుని చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి.
అదే ప్యాకేజీ ఆరోపణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్నారు. బహుశా అదే అసహనం ఆయన్ని వెంటాడుతున్నట్టుంది. ముఖ్యమంత్రి ముందర చిరంజీవి లాంటి వ్యక్తికే చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందనీ పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఇదెక్కడి పంచాయితీ.? సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖుల బృందం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్, వారి సమస్యలని విన్నారు.. పరిష్కారం చూపారు.
ఇక్కడ, చిరంజీవి చేతులు కట్టుకుని కూర్చోవడం వల్ల జరిగిన అవమానమేంటట.? అన్న ప్రస్తావన ఎందుకు వస్తుందనేది చాలామంది డౌటానుమానం. చిరంజీవి పేరునీ, ప్రజారాజ్యం పార్టీ పేరునీ పవన్ ప్రస్తావించడమంటే, అది పవన్ తన అన్నను అవమానించినట్లే అవుతుందేమో.! లేకపోతే, ప్రజారాజ్యం పార్టీలో అప్పుడు వున్న నేతలు, కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసెయ్యాలని ఒత్తిడి చేశారనీ, వారిప్పుడు వైఎస్సార్సీపీలో వున్నారనీ పవన్ ఆరోపిస్తున్నారు.
రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. పవన్ సొంత కుంపటి పెట్టారు జనసేన పార్టీ పేరుతో. అందరూ అలా సొంత పార్టీలు పెట్టుకోలేరు కదా.? చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఆ తర్వాత కాంగ్రెస్ నేత అవలేదా.?
ఏంటో పవన్ రాజకీయాలు, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందో లేదో.!