కరోనా పాండమిక్ పరిస్థితుల నేపథ్యంలో తలెత్తినన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు అప్పులు చేయక తప్పడంలేదు. మన దేశంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలూ అప్పులు చేస్తున్నాయి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ.. అంతే తేడా.
అయినా, మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో అప్పులు చేయడం అనేది సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. సరే, ఇలా ప్రభుత్వాలు చేసే అప్పుల తాలూకు భారం మోయాల్సింది ప్రజలేననుకోండి.. అది వేరే సంగతి. ప్రజలు అలా ఆ అప్పుల భారం గురించి తెలుసుకోకుండా చేయడానికి ప్రభుత్వాలు చేసే జిమ్మిక్కులు కొత్త వ్యవహారం కాదు.
అప్పుల విషయమై వైఎస్ జగన్ సర్కారుని ప్రశ్నిస్తూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లోని ప్రధానమైనది నవరత్నాలు అనే అంశాన్ని ప్రస్తావించారు జనసేనాని. అప్పులు చేసి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు సరే, అప్పులు అలాగే వడ్డీల భారాన్ని మోసే ప్రజల సంగతేంటన్నది జనసేనాని ప్రశ్న.
అంతా బాగానే వుందిగానీ, కేంద్రం చేస్తోన్నదేంటి.? కేంద్రం రకరకాల మార్గాల్లో నిధుల్ని సమీకరించుకుంటోంది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తోంది. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి. కేంద్రం, దేశ ప్రజల మీద మోపుతున్న అప్పుల భారాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించకపోతే ఎలా.? బీజేపీ, జనసేనకు మిత్ర పక్షం గనుక.. బీజేపీని, బీజేపీ నేతృత్వంలో నడిచే కేంద్ర ప్రభుత్వాన్నీ ప్రశ్నించరన్నమాట.
ఇదీ జనసేనాని చిత్తశుద్ధి ప్రజల విషయంలో.. రాజకీయాల విషయంలో.