పవన్ వద్దనుకున్నా ఫ్యాన్స్ తలదూరుస్తున్నారు

pawan kalyan
సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిదో చెప్పాల్సిన పని లేదు.  ఆయన చరీష్మాను కేవలం ఆయన కుటుంబానికి చెందిన హీరోలు మాత్రమే కాదు ఇతర హీరోలు, నటులు చాలా మంది తమ సినిమాల్లో వాడుకునేవారు.  కానీ ఆ వాడకం సరైన రీతిలో, సదుద్దేశంతోనే ఉండేది.  పవన్ అభిమానులు సైతం తమ హీరోను పొగుడుతూ మాట్లాడేవారిని ఎంకరేజ్ చేసేవారు.  పొరపాటున ఎవరైనా పవన్ మీద ట్రోల్స చేస్తే విరుచుకుపడేవారు.  సినిమాలో మాత్రమే కాదు బయట కూడా ఎవరైనా సరే పవన్ మీద విమర్శలకు దిగితే వారు ఎంతటివారైనా లెక్కపెట్టేవారు కాదు ఫ్యాన్స్.  వారిలోని ఈ ఆవేశాన్నే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ క్యాష్ చేసుకుంటున్నారు.  
 
గతంలో కూడా పలుసార్లు పవన్ మీద, మెగా హీరోల మీద సెటైర్లు వేసి అభిమానుల్ని రెచ్చగొడుతూ జనం నాలుకల మీద నానారు వర్మ.  ఇక పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అభిమానులతో కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుని అప్పటికప్పుడు పబ్లిసిటీ పొందిన మనుషులు కొందరు ఉన్నారు.  వారికి కావాల్సిందల్లా అభిమానుల ఎమోషన్.  దాన్ని రెచ్చగొట్టి పని జరుపుకోవడం.  చాలా మంది ప్లే చేసే ఈ ట్రిక్ ముందు ఫ్యాన్స్ ఊరికే పడిపోతుంటారు.  అదే రామ్ గోపాల్ వర్మకు అలుసైపోతోంది.  కావాల్సినప్పుడల్లా అభిమనుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు.  
 
ప్రజెంట్ ఆయన పవన్ కళ్యాణ్ మీద ‘పవర్ స్టార్’ అనే సినిమా తీస్తున్నాడు.  ఈ నెల 25న ఆర్జీవీ వరల్డ్ థియెటర్లో విడుదల చేస్తున్నాడు.  ఈ సినిమా చూడాలంటే వర్మకు డబ్బులు చెల్లించాలి.  అంతేనా 22న ట్రైలర్ విడుదల చేస్తున్నారు.  దాన్ని చూడాలన్నా 25 రూపాయలు చెల్లించాల్సిందే.  ఈ రకంగా తక్కువలో సినిమా చేసి దాన్ని సేల్ చేసి క్యాష్ చేసుకోవాలనేది వర్మ ప్లాన్.  అందుకే పవన్ మీద సినిమా.  దాని మీద హైప్ క్రియేట్ చేయడం కోసం పబ్లిసిటీ కావాలి.  దానికే పవన్ అభిమానులని రెచ్చగొట్టడం.  ఇవన్నీ అభిమానులకు కూడా తెలుసు.  కానీ క్షణికావేశం.  కోపంలో అప్పటికప్పుడు వర్మ మీద విరుచుకుపడి సోషల్ మీడియాలో రచ్చ చేయడం.  వర్మ దాన్ని ఎంజాయ్ చేయడం. 
 
గతంలో వర్మ విషయంలో పవన్ ఒకేఒక్కసారి స్పందించారు.  అప్పుడు కూడా అలాంటి వాళ్ల గురించి మాట్లాడటం అనవసరం అంటూ ఆ తర్వాత ఆయన టాపిక్ మళ్లీ మాట్లాడలేదు.  పవన్ అభిమానులకు కూడా వర్మకు దూరంగా ఉండమని, కవ్వించినా స్పందించవద్దని అనధికార ఆదేశాలున్నాయి.  కానీ ఫ్యాన్స్ మాత్రం పవన్ మాదిరి గీత దాటకుండా ఉండలేకపోతున్నారు.  వర్మ చర్యలకు రియాక్ట్ అవుతూనే ఉన్నారు, ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ ఇస్తూనే ఉన్నారు.  ఇప్పుడు పవర్ స్టార్ సినిమా విషయంలో కూడా వర్మను తిడుతూ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేస్తున్నారు.  రేపు సినిమా విడుదలైతే తమ హీరోను ఎంతలా డీగ్రేడ్ చేశాడో తెలుసుకోవడం కోసం అభిమానులే ఎక్కువ చూసి వర్మకి లాభాలు తెచ్చి పెట్టేలా ఉన్నారు.  కాబట్టి అభిమానులు కూడా పవన్ మాదిరిగా వర్మను పట్టించుకుండా నిర్లక్ష్యం చేస్తే బాగుంటుంది.