చిరంజీవికి మోడీ ఆహ్వానం.? ఇందులో ఏముంది రాజకీయం.?

మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆహ్వానం అందిందట. భీమవరంలో వచ్చే నెల 4వ తేదీన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి నేపథ్యంలో ఆ మహనీయుడి విగ్రహావిష్కరణ చేయనున్నారు ప్రధాని మోడీ. ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ పాల్గొనే ఈ కార్యక్రమానికి చిరంజీవికీ ఆహ్వానం వెళ్ళింది.

చిరంజీవికి ఆహ్వానం వెళ్ళింది సరే, మిత్రపక్షం జనసేనకు బీజేపీ నుంచి ఆహ్వానం అందిందా.? అన్న ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. ఇది అధికారిక కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కార్యక్రమం. ప్రోటోకాల్ ప్రకారమే ఆహ్వానాలు వుంటాయి. చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. పైగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చిరంజీవికి ప్రత్యేకమైన అనుభవం వుంది. ఆయన పుట్టి పెరిగిన ప్రాంతమది.

రాజకీయాల్ని పక్కన పెడితే, చిరంజీవి చేపట్టిన, చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆహ్వానం ద్వారా ఇచ్చిందనేది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.

ఇంకోపక్క, చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినా, ఆయనకు లక్షలాదిమంది, కోట్లాదిమంది అభిమానులున్నారు. వాళ్ళందర్నీ ప్రసన్నం చేసుకోవడానికి నరేంద్ర మోడీ అత్యంత వ్యూహాత్మకంగా ఈ ‘ఆహ్వానం’ పంపారన్నది ఓ వాదన. అందులోనూ నిజం లేకపోలేదు.

రాజకీయాల సంగతెలా వున్నా, చిరంజీవికి ఇదొక అరుదైన గౌరవంగానే చెప్పుకోవాలి. అన్నట్టు, చిరంజీవి తనయుడు పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో, అల్లూరి గెటప్‌కి అంతా ఫిదా అయిన సంగతి తెలిసిందే.