Manchu Vishnu : మంచు విష్ణు ఆ ట్వీటునెందుకు తొలగించాడబ్బా.?

Manchu Vishnu : సినీ నటుడు, ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీటేశాడు. సినీ పరిశ్రమ సమస్యలపై ఏనాడూ సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించని విష్ణు, ఆ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినీ నటుడు చిరంజీవి, ఆయనతోపాటు మహేష్, ప్రభాస్, రాజమౌళి తదితరులు చర్చించిన మరుసటిరోజు, ట్వీటేయడమేంటి.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

మంత్రి పేర్ని నాని, మంచు మోహన్‌బాబు ఇంటికి వెళ్ళారు. అలా నానితో మోహన్‌బాబు, విష్ణు పలు అంశాలపై చర్చించారు. ఈ విషయాన్నే మంచు విష్ణు తొలుత సవివరంగా ట్వీటేశాడు. కానీ, ఏమయ్యిందో.. ఆ ట్వీటుని తొలగించి, అందులో కొంత భాగాన్ని కత్తిరించి మళ్ళీ ట్వీటేశాడు మంచు విష్ణు.
పరిశ్రమ సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తమకు వివరించినందుకు పేర్ని నానికి థ్యాంక్స్ చెబుతున్న విషయాన్ని మాత్రమే తన ట్వీటు నుంచి విష్ణు ఎందుకు తొలగించినట్టు.?

ఈ అంశం చుట్టూ మంచు విష్ణు మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూనే వుంది. ఏంటో, విష్ణు ఏం చేసినా అది ట్రోలింగ్‌కి దొరికేస్తోంది మరి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు, తన బృందాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పరిశ్రమ సమస్యలపై చర్చించి వుంటే బావుండేది. కానీ, ఆయన ఆ ప్రయత్నమే చేయలేదు. చేద్దామనుకున్నారేమోగానీ, ఈలోగా చిరంజీవి లీడ్ తీసుకున్నారు. కాదు కాదు, చిరంజీవిని ముందు పెట్టి పరిశ్రమ ప్రముఖులు తమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. అదీ అసలు సంగతి.

ఏదిఏమైనా, పరిశ్రమ సమస్యల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం స్వాగతించదగ్గదే. కానీ, ఇక్కడా క్రెడిట్ కోసం సినీ పరిశ్రమలో నడుస్తున్న ఆరాటమే అస్సలేమాత్రం బాగాలేదన్నది నెటిజనం వాదన. ఎవరి గోల వారిది.