ఆ నిర్మాతలెందుకు జనసేనానితో భేటీ అయ్యారు?

‘పరిశ్రమ పెద్ద’ అనే హోదాని చిరంజీవి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్‌కి బదిలీ చేస్తున్నారా.? ఇప్పుడీ చర్చ తెలుగు సినీ పరిశ్రమలో చాలా గట్టిగా వినిపిస్తోంది. సినిమాకి నిర్మాతలే గొప్ప.. అని ‘మా’ ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ ఇబ్బందులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగింది. ఈ క్రమంలోనే మంచు విష్ణు అడ్వాంటేజ్ తీసుకున్నాడు.

‘మా’ ఎన్నికల్లో తన ప్రత్యర్ధి అయిన ప్రకాష్ రాజ్ మీద విమర్శలు చేసే క్రమంలో ‘నువ్వు పవన్ కళ్యాణ్ వైపు ఉంటావా.? తెలుగు సినిమా పరిశ్రమ వైపు ఉంటావా.?’ అని విష్ణు ప్రశ్నించాడు. దాని అర్ధం పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమలో లేడు, సినీ పరిశ్రమతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సంబంధం లేదు.. అనే.

ఇదిలా ఉంటే, ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు, నారంగ్, బన్నీ వాస్, మైత్రీ నవీన్ తదితరులు ఈ రోజు పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలో అత్యంత కీలకమైన విలువైన వ్యక్తి అని నిర్మాతలు స్పష్టతనిచ్చినట్లే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ రాజకీయంగా తలపడుతున్నారు. ఆ రాజకీయాల్లోకి సినీ పరిశ్రమలోని కొందరు అనవసరంగా తలదూర్చే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నారు.

అటు వైపు రాజకీయ పోరాటం చేస్తూనే, ఇటు పరిశ్రమ తరపున మాట్లాడడం అంటే ఆషా మాషీ విషయం కాదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తెగువకు ప్రశంసలు దక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ వల్ల సినీ పరిశ్రమ రాజకీయ ఇబ్బందులు ఎదుర్కుంటుందనే అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేసిన వాళ్లే తమ వ్యాఖ్యల్ని సవరించుకోవల్సిన పరిస్థితి. అలాంటి వారి వల్లే పవన్ కళ్యాణ్, చిరంజీవి కంటే పెద్దన్నగా ఇప్పుడు కనిపిస్తున్నారనే చర్చ సినీ పరిశ్రమలో నడుస్తోంది.