రాష్ట్రంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాని మీద స్పందించమని, ప్రజలకు మద్దతు తెలపమని సినీ సెలబ్రిటీలను డిమాండ్ చేస్తుంటారు జనం. అది మామూలే. ఇష్టం ఉన్నవాళ్లు స్పందిస్తారు లేనివాళ్లు స్పందించరు. ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టలేం. కానీ పర్టిక్యులర్ గా ఒక్క వ్యక్తినే పట్టుకుని సపోర్ట్ చేయండి, మా వెనక ఉండండి అంటే ఏమనుకోవాలి. ఇదే మంచు విష్ణు జరుగుతోంది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీన్ని వ్యతిరేకించడమంటే ప్రధాని మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే. అందుకే ఆయనకు మద్దతుగా ఉన్నవారి మీద ఈ ఎఫెక్ట్ పడుతోంది.
మంచు మోహన్ బాబు కుటుంబానికి మోడీ అంటే చాలా అభిమానం. అప్పుడప్పడూ నేరుగా వెళ్లి కలిసి వస్తుంటారు. ఇదే జనానికి గుర్తొచ్చినట్టుంది. విష్ణు తన కొత్త సినిమా ‘మోసగాళ్లు’ ఈవెంట్ కోసమా వైజాగ్ వెళ్లగా అక్కడ ఉద్యమకారులు మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, ఉక్కు పరిశ్రమకు అండగా నిలబడాలని విష్ణును డిమాండ్ చేశారు. సినిమా ప్రమోషన్ కంటే ఈ సంఘటనే హైలెట్ అయింది. అలాగే తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో సైతం విష్ణు ముందుకు ఈ టాపిక్ తెచ్చారు మీడియా వాళ్ళు. అప్పుడు విష్ణు మోడీ మీద అభిమానం ఇప్పటిది కాదు. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుండి ఉంది. కానీ మనకి ఇష్టమైన వాళ్ళు ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటారని చెప్పలేం’ అంటూ విశాఖ ఉక్కు మీద తన తండ్రి అభిప్రాయాలను కూడ వెలిబుచ్చారు. మొత్తానికి సినిమా ప్రచారంలో కంటే ఈ విశాఖ ఉక్కు విషయంలోనే విష్ణు పేరు ఎక్కువగా వినిపిస్తోంది.