వకీల్ కోసం చిరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చుగా

Why Chiru not speaking for Pawan Kalyan

ఏపీ ప్రభుత్వానికి, ‘వకీల్ సాబ్’ డిస్ట్రిబ్యూటర్లకు నడుమ టికెట్ ధరల విషయమై రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజులు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు లేకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అదనపు షోలకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో హక్కులు కొన్నవారు కోర్టుకు వెళ్లారు. కోర్టు ప్రభుత్వ ఉత్తర్వుల మీద స్టే ఇచ్చింది. శని, ఆదివారాల్లో టికెట్ రేట్లు పెంచుకోవచ్చనే వెసులుబాటును ఇచ్చింది. అయితే దీన్ని కూడ అడ్డుకోవాలనే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. కాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది.

ఈ విషయం మీద ఇండస్ట్రీ పెద్దలెవరూ నోరు విప్పట్లేదు. సినిమా వాళ్ళు సినిమా కోసం ఎందుకు మాట్లాడరు అంటూ అభిమానులే ప్రశ్నిస్తున్నారు. కొందరు పవన్ ఫ్యాన్స్ అయితే అసలు ముందు మెగాస్టార్ చిరంజీవి స్పందించాలని అంటున్నారు. చిరు ఈమధ్య ప్రభుత్వ నిర్ణయాలను కొనియాడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఉయ్యాలవాడ పేరును కర్నూలు విమానాశ్రయానికి పెట్టడం, తర్వాత కరెంట్ ఛార్జీల విషయంలో థియేటర్లకు ఊరట కలిగించడం లాంటి నిర్ణయాలను పొగిడారు. మంచి పనులు చేసినప్పుడు చప్పట్లు కొట్టిన చిరు ఇప్పుడు పవన్ సినిమా విషయంలో అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నారు. మరి చిరు వకీల్ సాబ్ గొడవలో తమ్ముడు పవన్ కు అండగా ఉంటారో లేదో చూడాలి.