Botsa Gone Silence : బొత్స సత్యనారాయణ మౌనం దేనికి సంకేతం.?

Botsa Gone Silence :  ‘ఎవరికి పదవి ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి విచక్షణ మీద ఆధారపడి వుంటుంది. ఎవర్ని తన మంత్రి వర్గంలో వుంచుకోవాలన్నది ముఖ్యమంత్రి ఇష్టం. ఆయన ఇంకోసారి మంత్రి పదవి ఇస్తే మంత్రిగా వుంటాను. లేదంటే, పార్టీ కోసం పని చేస్తాను..’ అంటూ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు ముందు వైసీపీ కీలక నేత, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

తెరవెనుకాల మంత్రి పదవి కొనసాగింపు కోసం బొత్స చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి సఫలమయ్యారు. ‘అనుభవం, సమర్థత’ కోణంలో బొత్సని మంత్రిగా వైఎస్ జగన్ కొనసాగించగా, ఇప్పుడాయన కొత్త శాఖ విషయమై అసంతృప్తితో వున్నట్లు కనిపిస్తోంది.

విద్యా శాఖ మంత్రిగా బాద్యతలు స్వీకరించాల్సిన బొత్స సత్యనారాయణ, ఇంకా బాద్యతలు తీసుకోలేదు. ఎందుకిలా.? అంటే, ఆయన తిరిగి తన పాత శాఖ కావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఒత్తిడి తెస్తున్నారంటూ వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అది గనుక నిజమే అయితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

ఇప్పటికే 90 శాతం మంది మంత్రుల్ని మార్చేస్తానని చెప్పి మాట తప్పిన వైఎస్ జగన్, బొత్స ఒత్తిడికి ఓ సారి తలొగ్గి.. ఇంకోసారి బొత్స డిమాండ్లను అంగీకరిస్తే వైసీపీ శ్రేణుల దృష్టిలోనే పలచనైపోతారు. అయితే, ‘బొత్స అసంతృప్తితో లేరు..’ అని మాత్రం వైసీపీ అధినాయకత్వం నుంచి జోరైన ప్రచారమైతే జరుగుతోంది.

ఇంతకీ ఏది నిజం.? బొత్స ఎందుకు మంత్రిగా బాద్యతలు తీసుకోవడంలేదు.? బొత్స పోర్ట్‌ఫోలియో మార్చుకోగలరా.? కాలమే సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నలకి.