దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలనే ఉద్దేశ్యంతో భారతీయ జనతా పార్టీ తన ట్రేడ్ మార్క్ రాజకీయాలకు తెరతీసింది. ఎక్కడికక్కడ సర్దుబాటు మాటలు చెబుతూ జనాన్ని మభ్యపెడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రాలో ఈ తరహా ధోరణి కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ముందుగా ప్రత్యేక హోదా విషయంలో ప్లేటు పిరాయించిన కాషాయ దళం మెల్లగా రాజధాని అంశంలో కూడా అదే తరహా వైఖరిని అవలంభించింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినా వెంటనే మూడు రాజధానుల పేరుతో అమరావతి నుండి రాజధానిని తరలించాలని నిర్ణయించుకున్నారు. దాంతో అన్ని రాజకీయ పార్టీలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కానీ బీజేపీ మాత్రం స్తబ్దుగానే ఉండేది.
స్వయంగా మోదీ వచ్చి శంఖుస్థాపన చేసిన అమరావతిని ఇలా నిర్వీర్యం చేస్తుంటే రాష్ట్ర బీజేపీ శాఖ ఏం చేస్తున్నారని రైతులు ప్రశ్నించారు. అయినా బీజేపీ నోరు మెదపలేదు. ఒకానొక శుభదినాన కేంద్రం నుండి రాష్ట్ర రాజధానికి మాకు సంబంధం లేదని, అది రాష్ట్ర పరిధిలోని విషయమని తేల్చి చెప్పేశారు. దీంతో జనానికి బీజేపీ వైఖరి ఏంటో అర్థమైపోయింది. అంతేకాదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుండి కన్నా లక్ష్మీ నారాయణను తొలగించడం కూడ అమరావతి పట్ల బీజేపీ కమిట్మెంట్ ఏంటో తెలిపింది. కేవలం కన్నా అమరావతికి అనుకూలంగా లేఖ రాయడమే బీజేపీ అధిష్టానానికి నచ్చలేదు. అందుకే పదవి నుండి దించేసి సోము వీర్రాజును కూర్చోబెట్టారు. వీర్రాజు నియామకం వెనుక పాలక వర్గం హస్తం కూడ ఉందనే వార్తలొచ్చాయి.
కేంద్రం వైపు నుండి అమరావతికి ప్రతికూలంగా ఇన్ని చర్యలు జరుగుతున్నా రాష్ట్ర శాఖ మాత్రం రైతులకు అండగా ఉంటామని, అదే విధంగా కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రెండు నాల్కల కథలు చెబుతూ వచ్చింది. ఈ తంతు మొత్తాన్ని చూసిన ప్రజలు అమరావతి విషయంలో ఇక బీజేపీని నమ్ముకుని లాభం లేదని ఆశలు వదిలేసుకున్నారు. ఇతర పార్టీలు సైతం రాజధాని అంశంలో బీజేపీ లాభాపేక్షతో నడుచుకుంటోందని అర్థం చేసుకుని వారి ప్రస్తావన తేవడమే మానేశారు. కానీ ఇంతలో సోము వీర్రాజుగారు అమరావతి నుండి రాజధాని తరలిపోయే ప్రసక్తే లేదు. అమరావతిలోనే రాజధాని ఉండాలి అనేది బీజేపీ లక్ష్యం. ఇందులో రెండో అంశానికి తావు లేదు. రాష్ట్ర బీజేపీ కార్యాలయం విజయవాడలోనే కడుతున్నాం. సీఎం మూడు రాజధానులు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మోదీ అమరావతి వైపే ఉన్నారు అంటూ కథను మళ్ళీ మొదటికి తెచ్చారు.
అయితే వీర్రాజుగారు అంత బలంగా చెప్పడంతో పై నుండి క్లారిటీ లేనిదే పార్టీకి వీరవిధేయుడైన వీర్రాజు అలా మాట్లాడారు అంటే ఇన్నాళ్లు అమరావతిని పట్టించుకోని కేంద్రం ఇకపై అనుకూలంగా మాట్లాడి ప్రజలను తమవైపుకు తిప్పుకోవాలని భావిస్తున్నట్టు అర్థమైంది. అలాంటప్పుడు గతంలో అమరావతికి అనుకూలంగా వ్యవహరించి కన్నా లక్ష్మీ నారాయణను ఎందుకు పదవి నుండి తొలగించింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దానితో పాటే ఆయన్ను పక్కనపెట్టడం వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా అనే అనుమానం కూడ కలుగుతోంది.