కరోనా దెబ్బకి తెలుగు సినీ పరిశ్రమ విలవిల్లాడుతోంది. నిజానికి, కరోనా వైరస్ కంటే ముందే తెలుగు సినీ పరిశ్రమలో సంక్షోభం బయల్దేరింది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాల్ని చంపేస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఇంకోపక్క పెద్ద సినిమాల్లో విషయం వుండటంలేదు. పెద్ద హీరోలు ఏళ్ళ తరబడి సినిమాలు చేస్తుండడంతో, థియేటర్లలో మంచి సినిమాలు రిలీజవడమే గగనమైపోయింది. అసలే తెలుగు సినిమా సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఇంతలోనే ఓటీటీ ముంచుకొచ్చింది. మూలిగే నక్క మీద తాటికాయ అన్నట్టు, కరోనా వైరస్ వచ్చి థియేటర్లు మూతపడ్డాయి. ‘ముందుగా థియేటర్లు మూతపడి, ఆఖరున థియేటర్లు తెరచుకుంటాయి..’ అంటూ హీరో నాని ఇటీవల అసహనం వ్యక్తం చేశాడు. అసలు ఓటీటీలో సినిమాలు విడుదల చేయకూడదని పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిట్లు వాపోతున్నారు. థియేటర్లతోపాటు ఓటీటీ కూడా వర్ధిల్లాలి.. అని పలువురు నిర్మాతలు సెలవిచ్చారు. ఆ నలుగురు తెలుగు సినిమాని చంపేశారన్న విమర్శ ఈనాటిది కాదు.
ఆ సంగతి పక్కన పెడితే, ఏదన్నా సినిమా వచ్చిందంటే చాలు, థియేటర్ల వద్ద భయంకరమైన బ్లాక్ టిక్కెటింగ్ పెరిగిపోయింది. ఓ సగటు కుటుంబం సినిమా చూడాలంటే, అది సాధ్యమయ్యే పని కాదన్నట్టు తయారైంది పరిస్థితి కొన్నాళ్ళ క్రితం. ఈ పైత్యంలో నిర్మాతలదే ప్రధాన వాటా.. అన్న విమర్శలు లేకపోలేదు. పెద్ద పెద్ద కాంబినేషన్లు వర్కవుట్ అవడం మాటేమోగానీ, ఫ్లాప్ బొమ్మకి కూడా వసూళ్ళు ఎలా రాబట్టాలో కిటుకులు నేర్చుకుని, సామాన్య ప్రేక్షకుడ్ని థియేటర్లకు దూరం చేశారు సినీ పెద్దలు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఏడాది అంతా ఓటీటీలో నచ్చిన సినిమాని నచ్చినప్పుడు చూసుకునేందుకు.. జస్ట్ 300 నుంచి 100 రూపాయలదాకా ఖర్చు చేస్తే సరిపోతుంది. ఈ ఆప్షన్ వచ్చాక, థియేటర్‌లో సినిమా చూడాలన్న ఆలోచన చాలామంది ప్రేక్షకుల్లో చచ్చిపోయింది. నిజమే, కొన్ని సినిమాల విషయంలో టిక్కెట్ల రేట్లు పెరగాలి. అలా పెరిగాక కూడా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందంటే, దానికి నిర్మాతలు, హీరోలు బాధ్యత వహించాల్సిందే. మళ్ళీ సినిమా, ప్రేక్షకులకు చేరువడం.. అనేది థియేటర్ల విషయంలో కష్టమే.