టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడ.?

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడ.? టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నాయి. బాలయ్యే కాదు, జూనియర్ ఎన్టీయార్ కూడా వాళ్ళకి కనిపించడంలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ సహా చాలామంది నందమూరి కుటుంబ సభ్యుల గురించి నందమూరి అభిమానులు, టీడీపీ అభిమానులు వెతుకుతున్నారు.

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబు మీడియా ముందు బోరున విలపించడం తెలిసిన సంగతులే.

నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఈ వ్యవహారంపై స్పందించారు.. చంద్రబాబుకి బాసటగా నిలిచారు. బీజేపీ నేత దగ్గుబాటి పురంధరీశ్వరి (స్వర్గీయ ఎన్టీయార్ కుమార్తె) కూడా స్పందించారు. తన సోదరి భువనేశ్వరి తాను విులవలతో పెరిగామని చెప్పుకొచ్చారు. ఆమెపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం తగదంటూ వైసీపీపై అసహనం వ్యక్తం చేశారు.

మరి, సోదరికి బాసటగా నందమూరి బాలకృష్ణ ఎందుకు ఇంతవరకు మాట్లాడలేకపోయారు.? ఈ వ్యవహారంపై ఎన్టీయార్ కుటుంబ సభ్యుడిగా యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎందుకు స్పందించలేకపోయాడు.? కళ్యాణ్ రామ్, ఎన్టీయార్ సంగతిని పక్కన పెడదాం, టీడీపీ ఎమ్మెల్యే కూడా అయిన బాలకృష్ణ మౌనం దాల్చడమే ఇప్పుడందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

మాట్లాడితే, బ్లడ్డూ.. బ్రీడూ.. అంటూ సినిమాటిక్ డైలాగులు చెప్పే బాలకృష్ణ, తన రక్త సంబంధం.. తన సోదరి మీద రాజకీయ ప్రత్యర్థులు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తే, ‘అఖండ’లా గర్జించాలి కదా.?