కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీపై విమర్శల వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. పేదలకు లేని ప్యాకేజీ ఎవరి కోసమంటా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రశ్నించింది. కరోనా టైమ్ లో చేస్తోన్న సంస్కరణలు ఏమాత్రం హేతుబద్దంగా లేవని పలువురు ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇటు ఏపీ కూడా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తిగానే ఉంది. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటోన్న పరిస్థితులు ఏంటి? కేంద్రం తీసుకుంటోన్న చర్యలేంటని? తీవ్ర అసహనంతో ఉన్నారు.
తాజాగా ఈ ప్యాకేజీ పేద ప్రజలకు ఉపయోగడే విధంగా లేదని తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రజలు తిరగని సమయంలో విమానశ్రయాల అభివృద్దికి నిధులు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. విమాన రంగంలో సంస్కరణల వల్ల పేదలకు ప్రయోజనం ఉంటుందా? అని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటిస్తోన్న ప్యాకేజీలో సామాన్యులకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదని, ఆర్ధిక సంస్కరణలకు ఇది సరైన సమయం కాదన్నారు.
కరోనా నేపథ్యంలో చాలా దేశాలు జీడీపీలో 15 శాతం వరకూ రాష్ర్టాలు, ప్రజలకు సహాయం చేసాయని వివరించారు. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఆర్ధికంగా చితికిపోయిందన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది కార్మికులు వచ్చి ఇక్కడ ఉఫాది పొందుతున్నారు. ఉఫాది విషయంలో తెలంగాణ ప్రజలు, యువత ఆలోచించాలని వినోద్ కుమార్ విజ్ఞప్తి చేసారు.