ఆంధ్రపదేశ్ రాష్ట్రం ఒకేరోజు 13 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ చేసి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఆ రికార్డుని మరుసటి రోజే మహారాష్ట్ర చెరిపేసింది. మహారాష్ట్రలో నిన్న సుమారు పదహారు లక్షల మందికి పైగా వ్యాక్సిన్లను అందుకున్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ జోరు పెరిగింది. కానీ, తెలంగాణ పరిస్థితేంటి.? కేవలం లక్ష నుంచి లక్షన్నర డోసులు మాత్రమే వేస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం అను నిత్యం.
ఈ సంఖ్య 5 లక్షలకు పెరిగేదెప్పుడు.? ఒక్క రోజులో పది లక్షలు ఆ పైన వ్యాక్సిన్లను వేసే పరిస్థితి చూస్తామా.? అన్న చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతోంది. అయితే, టార్గెట్ గ్రూపులు.. అంటూ కరోనా వ్యాప్తికి అవకాశం వున్న గ్రూపులకు వ్యాక్సినేషన్ వేస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
ఇది కొంత వరకు మంచి ఆలోచనే. మరోపక్క, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ లభ్యత బాగానే వుంది. అయినాగానీ, వ్యాక్సినేషన్ కోసం మెగా డ్రైవ్స్ పెద్దయెత్తున నిర్వహించాల్సిన ఆవశ్యకత అయితే తెలంగాణలో బాగా వుంది. మొన్నామధ్యన ఓ ప్రైవేటు ఆసుపత్రి ఒకే రోజు 50 వేలకు పైగా డోసుల్ని వేసింది.. అయితే, అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. సామాన్యుల కోసం కాదది. కేంద్రం నిన్నటి నుంచి రాష్ట్రాలకు అవసరమైన టీకాల్ని ఉచితంగా అందిస్తున్న దరిమిలా, తెలంగాణ ప్రభుత్వం మరింత చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా వుంది.
కరోనా మూడో వేవ్ ఇప్పట్లో రాదు.. అక్టోబర్ ముందు వచ్చే అవకాశమే లేదని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారుగానీ.. ఇప్పటిదాకా కరోనా.. ఎవరి అంచనాలకూ అందకుండానే జనాన్ని ముంచేసింది. వ్యాక్సినేషన్ ఒక్కటే కరోనా నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి, వీలైనంత వేగంగా తెలంగాణ ప్రభుత్వం అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి వుంది.