మెగాస్టార్ చిరంజీవిని పవర్ స్టార్ (అలా పిలవొద్దని పవన్ అంటున్నా, అభిమానులు ఊరుకోరు కదా..) పవన్ కళ్యాణ్ కలిశారు. అన్నయ్య చిరంజీవిని తమ్ముడు పవన్ కలిస్తే, అందులో వింతేముంది.? నిజానికి, ఇది కాస్త చర్చనీయాంశమే. ఎందుకంటే, వీరిద్దరి ఈ కలయికకి ముందు కీలక పరిణామాలు చాలా చాలా జరిగాయి అటు రాజకీయాల్లో, ఇటు సినీ రంగంలో.
‘మా’ ఎన్నికల వ్యవహారం.. ఇంకోపక్క సినిమా టిక్కెట్ల వ్యవహారం.. వెరసి పవన్, వైసీపీ మధ్య జరిగిన రాజకీయ, సినీ రచ్చ అంతా ఇంతా కాదు. మోహన్ బాబు క్యాంప్ పూర్తిగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసింది. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగినట్లే కనిపించినా, మోహన్ బాబు వైపు నుంచి కవ్వింపులు కొనసాగుతున్నాయ్.
చిరంజీవిని మోహన్ బాబు టార్గెట్ చేయడం కూడా చూస్తూనే వున్నాం. అయితే, ఈ వ్యవహారాలపై మెగా కాంపౌండ్ మాత్రం కాస్త సైలెంటుగా వుంటూ వచ్చింది. ఇలాంటి సమయంలో చిరంజీవిని పవన్ కళ్యాణ్ కలవడం ఇటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో చర్చనీయాంశం కాకుండా ఎందుకు వుంటుంది.?పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన మాటలపై చిరంజీవి ఆవేదన చెందారంటూ ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరి, చిరంజీవి ఈ విషయమై పవన్ కళ్యాణ్‌ని మందలించారా.? అంటే, ఆ పరిస్థితే వుండదు అన్నదమ్ముల మధ్య.. అన్నది ఈ ఇద్దరి గురించీ బాగా తెలిసినవారు చెప్పే అంశం.
చిరంజీవి ఆలోచనలు వేరు, పవన్ కళ్యాణ్ ఆలోచనలు వేరు.. పవన్ వ్యవహారాల్లో చిరంజీవి జోక్యం చేసుకోరు. అన్నయ్యకు ఏ అవసరమొచ్చినా వెంటనే అక్కడ వాలిపోతారు పవన్ కళ్యాణ్. తమ్ముడికి ఏ అవసరమొచ్చినా, పెద్దన్నయ్య ఆపన్నహస్తం అందిస్తారు.
వైసీపీకి దగ్గరగా వుంటున్న చిరంజీవి, తన తమ్ముడ్ని అస్సలు ఈసారి దగ్గరకు చేరనివ్వరు.. అనేంతలా వైసీపీ దుష్ప్రచారం చేస్తే.. నాన్సెన్స్.. అని కొట్టిపారేసినట్టుంది.. చిరంజీవి, పవన్ తాజా కలయిక.!