పవన్ కళ్యాణ్ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు, నిర్మాత కూడా. చాన్నాళ్ళ క్రితం ‘జానీ’ అనే సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో కొన్ని సినిమాలూ నిర్మించారు.. భవిష్యత్తులోనూ సినిమాలు నిర్మించే అవకాశం వుంది. మరి, సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్‌కి వున్న గౌరవమేంటి.? ఏమీ లేదు, జస్ట్ జీరో.. అని నిన్నటి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖతో తేలిపోయిందనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది. వ్యక్తుల అభిప్రాయాలతో తమకు సంబంధం లేదంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ లేఖ విడుదల చేసింది.. సినీ పరిశ్రమ సమస్యలపై గళం విప్పే క్రమంలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తావన తీసుకురావడానికి సంబంధించి. పవన్ చేసిన రాజకీయ విమర్శల్ని సినీ పరిశ్రమ తరఫున ఛాంబర్ ఖండించి వుండొచ్చుగాక.
కానీ, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల మాటేమిటి.? ఛాంబర్ అంత తేలిగ్గా ఓ ప్రకటన విడుదల చేసేసి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని లైట్ తీసుకోవడమేంటి.? అసలు ఛాంబర్ ఎవరి కోసం పనిచేస్తోంది.? అన్నదిక్కడ చర్చనీయాంశమయ్యింది. పైగా, ప్రభుత్వాల సహకారం లేకుండా సినీ పరిశ్రమ మనుగడ కష్టం.. అన్న భావనను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యక్తం చేయడం మరీ శోచనీయం. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీ పరిశ్రమకు ప్రభుత్వాల సహకారం అత్యంత అవసరం. కరోనా నేపథ్యంలో పరిశ్రమ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వుంది.
ఈ నేపథ్యంలోనే పరిశ్రమ పెద్దలు తమ పరిశ్రమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా సినీ పరిశ్రమను ఆదుకునేందుకు తాము సుముఖంగా వున్నట్లు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ ప్రసంగాలు, పరిశ్రమను ఇరకాటంలో పడేశాయి. దాంతో, వున్నపళంగా పవన్ కళ్యాణ్ తీరుని ఖండించాల్సి వచ్చిందన్న చర్చ సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘ఇంకా నయ్యం.. నేరుగా పవన్ పేరు ప్రస్తావిస్తూ లేఖ విడుదల చేయలేదు.. అలా చేసి వుంటే.. పవన్ పరువు పూర్తిగా పోయేది..’ అనే అభిప్రాయాలు సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.