గవర్నర్ సంతకంతో మూడు రాజధానులు ఖరారైపోయాయి. సీఆర్ డీ ఏ బిల్లు రద్దు కు ఆమోద ముద్ర పడింది. అటు అమరావతి సహా ఆ చుట్టు పక్కల జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తదుపరి ఎలా ముందుకు వెళ్లాలని జేఏసీ కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిటికల్ వ్యూహం రచిస్తున్నారు. తనతో సహా ఉన్న ఎమ్మెల్యేలు అంతా రాజీనామాలు చేసి ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. చట్టపరంగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇలా గవర్నర్ రాజ ముంద్రతో అందరికీ పెద్ద పని పడింది. మరి ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి? ఈ అంశంపై భవిష్యత్ కార్యచరణ ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది.
రాజధాని తరలింపు విషయంలో పెద్ద ఎత్తున వ్యతిరేకించిన జనసేనాని తర్వాత రోజుల్లో ఆ వేడిని తగ్గించేసారు. రైతులకు మద్దతుగా విజయవాడ లో కవాత్తులు చేస్తామని ప్రకటించని జనసేనాని తర్వాత పూర్తిగా చల్ల బడిపయారు. అలాగని మూడు రాజధానులను సమర్ధించినట్లు కాదు…వ్యతిరేకిస్తూనే తరలింపుకు ఎంత మాత్రం ఒప్పుకోమని రైతుల పక్షాన నిలబడ్డారు. అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పనిచేయడం కొంత వరకూ కలిసొచ్చింది. అయితే ఆ తర్వాత కన్నాని తప్పించి సోము వీర్రాజు ని అధ్యక్షుడి చేయడంతో రాజధాని తరలింపు విషయంలో పవన్ తో ఏకీభవించడం అన్నది జరగదని తొలి రోజే తేలిపోయింది.
భవిష్యత్ లో ఈ రెండు పార్టీలు ఈ విషయంలో ఎలా కలిసి పనిచేస్తాయి? అన్నది పక్కన బెడితే! పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజధాని రైతులకు ఏమని బధులిస్తారు? వాళ్లని ఏ విధంగా ఓదార్చుతారు? అన్నది ఆసక్తికరం. ఆదివారం పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో జనసేనాని అత్యవసర సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, 3 రాజధానులపై టెలీకాన్ఫరెన్స్‌లో నేతల అభిప్రాయాలు తీసుకోనున్నాట్లు తెలిసింది. రాజధాని రైతులకు జనసేన తరఫున ఎలా అండగా ఉండాలన్న దానిపై ప్రధానంగా చర్చ జరగనుందిట. భవిష్యత్ కార్యాచరణపై జనసేన రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంలో పవన్ ఇప్పుడు ఒంటరిగానే పోరాటం చేయాల్సి ఉంటుంది. టీడీపీతో కలిసే ప్రశక్తే లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ పవన్ కి మద్దతివ్వదు. కాబట్టి జనసేనాని ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకెలా వెళ్తారు? అన్నది తెలియాల్సి ఉంది.