అరెరె.! ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏంటో తెలీదట.!

సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పేరు చెప్పగానే, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని దేశమంతా నినదిస్తుంది. కానీ, ఆయనకు మాత్రం ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏంటో తెలీదట. తెలంగాణలో కొన్నాళ్ల క్రితం జరిగిన దిశ ఘటన, తదనంతర ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సజ్జనార్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది.
ఇటీవల హైద్రాబాద్‌లో ఓ చిన్నారిపై హత్యాచారం జరిగితే, వీసీ సజ్జనార్ ఛార్జ తీసుకుని ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. సజ్జనార్ నేతృత్వంలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అంత సంచలనం సృష్టించింది మరి.

ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జనార్ దిశ ఎన్‌కౌంటర్ ఘటనకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణ సందర్భంగా సజ్జనార్‌పై సిర్పూర్కర్ కమీషన్ ఎదుట ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారట.

అందులో ఓ ప్రశ్నేంటంటే, మిమ్మల్ని ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటారట కదా.. అని కమీషన్ అడిగింది. దానికి సజ్జనార్ సమాధానమిస్తూ, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏంటో తనకు తెలీదని సజ్జనార్ చెప్పారట. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహరాల పైన మీడియాలో ఆసక్తికరమైన కథనాలు కనిపిస్తున్నాయి.

అయితే, జరిగింది ఘోరం. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి, అతి కిరాతకంగా చంపి తగలబెట్టేశారు నిందితులు. అలాంటి వారిపై ఎన్‌కౌంటర్ జరిగితే, ఆ ఎన్‌కౌంటర్ మీద విచారణ జరగడం, దానికి సజ్జనార్‌లాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వివరణ ఇవ్వాల్సి రావడం.. చాలా మందికి నచ్చడం లేదు.

కానీ, ఇండియన్ డెమోక్రసీ, భారత న్యాయ వ్యవస్థ ఇవన్నీ చాలా గొప్పవి. అందుకే, ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడు విచారణ కమీషన్లు తమ పని తాము చేసుకుపోతుంటాయ్.