సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా ‘రిపబ్లిక్’ అనాధ అయిపోయింది విడుదల సమయంలో. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, తదనంతర వివాదం అందరికీ తెలిసిందే. దాంతో, ఈ సినిమాకి విపరీతమైన హైప్ వచ్చి వుండాలి. కొంత హైప్ వచ్చినా, విషయం పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో.. సినిమా కాస్తా సైడ్ లైన్ అయిపోయింది.
‘రిపబ్లిక్’ సినిమా హిట్టవ్వాలంటూ పలువురు సినీ ప్రముఖులు ఆకాంక్షించిన మాట వాస్తవం.. అదీ సోషల్ మీడియా వేదికగా. అయితే, ‘రిపబ్లిక్’ సినిమా ఎలా వుంది.? అన్న విషయమై మీడియాలో పెద్దగా చర్చ జరగలేదు. సినిమాలోని సోషల్ మెసేజ్ బావున్నా, అది కమర్షియల్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది.
మొదటి రోజు వసూళ్ళు బాగానే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘లవ్ స్టోరీ’ మినహాయిస్తే, చెప్పుకోదగ్గ సినిమాలేవీ పోటీకి లేకపోవడం ‘రిపబ్లిక్’ సినిమాకి కలిసొస్తున్న అంశం. ‘లవ్ స్టోరీ’ జోరు కూడా బాక్సాఫీస్ వద్ద తగ్గాకనే ‘రిపబ్లిక్’ థియేటర్లలోకి వచ్చింది. దాంతో, ప్రేక్షకులకు ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది.
ఈ వీకెండ్ వరకూ ‘రిపబ్లిక్’ సినిమా వసూళ్ళకు డోకా వుండకపోవచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ వుండి వుంటే, ‘రిపబ్లిక్’ ఇంకో లెవల్ విజయాన్ని అందుకుని వుండేదేమో.