చిరంజీవి రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తారా.? ఇదిగో క్లారిటీ.!

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారా.? జనసేన పార్టీకి ఆయన మద్దతిస్తారా.? ప్రత్యక్ష ఎన్నికల్లో అసలు పోటీ చేస్తారా.? లేదా.? బీజేపీ నుంచి వస్తోన్న ఆఫర్ పట్ల చిరంజీవి స్పందన ఏంటి.? కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని ఇంకా తమవాడిగానే భావిస్తున్న దరిమిలా, చిరంజీవి ఈ విషయమై ఎలా స్పందిస్తారు.? కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం ఓటింగ్ జరగనుండగా, చిరంజీవికి కూడా ఐడీ కార్డు మంజూరు చేసిన దరిమిలా, చిరంజీవి ఓటెయ్యడానికి వెళతారా.? వైసీపీ నుంచి కూడా చిరంజీవికి మంచి ఆఫర్ వస్తోందట కదా.!

ఎన్నెన్నో ప్రశ్నలు.. బోల్డన్ని గాసిప్స్.! ఇంతకీ, మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, కేవలం మెగాస్టార్‌గానే సినీ రంగంలో కొనసాగుతారా.? తిరిగి రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతారా.? అన్నదానిపై స్పష్టత రావడంలేదు.

‘రాజకీయాన్ని నేను వదిలేసినా, నన్ను రాజకీయం వదల్లేదు..’ అని చిరంజీవి ఈ మధ్యనే ఓ డైలాగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ‘గాడ్ ఫాదర్’ సినిమాలోని డైలాగ్ కావొచ్చు. కానీ, ప్రస్తుత రాజకీయాలనుద్దేశించే చిరంజీవి ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావించాల్సి వస్తుందంటూ బోల్డన్ని విశ్లేషణలు జరిగాయి.. ఇదే విషయాన్ని చిరంజీవి నిన్న జరిగిన ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కూడా చెప్పారు.

రాజకీయాల్లోకి ఓసారి వస్తే, ఆ రాజకీయాన్ని వదిలించుకోవడం అంత తేలిక కాదు.! జనసేనకు మద్దతివ్వాలనీ, జనసేనలో చేరాలనీ చిరంజీవిపై ఒత్తిడి తీవ్రతరమవుతోంది కాపు సామాజిక వర్గ ప్రముఖుల నుంచి. కానీ, చిరంజీవి ఈ విషయంలో ఒకింత గట్టిగానే నిలబడినట్లు కనిపిస్తోంది.. తటస్థంగా వుండాలనే నిర్ణయానికి కట్టుబడి వున్నారాయన.

కానీ, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ‘గాడ్ ఫాదర్’ సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్. అందులో వున్న రాజకీయ పరమైన అంశాలు, తెలుగునాట రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతాయ్. ఓ సినిమాని కేవలం సినిమాగా చూసే రోజులు కావివి. సో, ‘గాడ్ ఫాదర్’ తర్వాత చిరంజీవి, రాజకీయ నిర్ణయం తీసుకోక తప్పనిసరయ్యేలానే వుంది.