బెల్లంకొండ శ్రీనివాస్ గత చిత్రం ‘అల్లుడు అదుర్స్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయితే ఈ పరాజయం తర్వాత తెలుగు మీద కాకుండా హిందీ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాడు బెల్లంకొండ. అక్కడ యాక్షన్ హీరోలు తక్కువయ్యారని, సౌత్ ఫ్లేవర్ అక్కడి వాళ్లకు బాగా నచ్చుతోందని వెంటనే అక్కడ సినిమా ప్లాన్ చేశాడు. తెలుగు ‘ఛత్రపతి’ని హిందీలోకి రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఆ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను వినాయక్ చేర్చుల్లో పెట్టారు. బెల్లంకొండ కుటుంబంతో వినాయక్ కు మంచి అనుబంధం ఉంది. వినాయక్ కు దర్శకుడిగా మొదట అవకాశం ఇచ్చింది బెల్లంకొండ సురేషే.
అందుకే కుమారుడి డెబ్యూను వినాయక్ ద్వారానే చేశారు. ఇప్పుడు హిందీ డెబ్యూ కూడ ఆయన చేతుల మీదుగానే చేస్తున్నారు. ఇదే కాకుండా ఇంకో బాధ్యతను కూడ ఆయన చేతుల్లో ఉంచారు. అదే ‘కర్ణన్’ తెలుగు రీమేక్. ‘ఛత్రపతి’ రీమేక్ రీస్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. భారీ బృందంతో షూటింగ్ చేయాలి కాబట్టి కాస్త ఎదురుచూడక తప్పదు. అందుకే ఈ గ్యాప్లో తెలుగులో ఒక సినిమా చేసి హిట్ ట్రాక్ అందుకుంటే బాగుంటుందని బెల్లంకొండ ఆలోచనట. ఎలాగూ ‘కర్ణన్’ రీమేక్ హక్కులు చేతిలోనే ఉన్నాయి కాబట్టి దాన్నే చేయాలని డిసైడ్ అయి దర్శకత్వ బాధ్యతలను అత్యంత నమ్మకమైన వినాయక్ చేతిలో పెట్టాలని నిర్ణయించారట. మొత్తానికి బెల్లంకొండ బాలీవుడ్, టాలీవుడ్ ఫ్యూచర్ వినాయక్ చేతుల్లోనే ఉందన్నమాట.