2019 ఎన్నికల తరువాత జనసేన పార్టీలోకి వలసలు పెరుగుతాయని అందరూ ఊహించారు. రెండు ప్రధాన పార్టీల్లోనూ వసతి లేని చిన్నా చితకా నేతలంతా జనసేనను వెతుక్కుంటూ వెళతారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా జనసేనలో ఉన్న ఆ కొద్దిమంది లీడర్లు కూడ పార్టీని వీడిపోవడం స్టార్ట్ చేశారు. ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక అసెంబ్లీ సమావేశాలు మొదలైన కొద్దిరోజులకే వైసీపీ పక్షం వహించారు. పాలాభిషేకాలు చేసి మరీ తాను వైసీపీ మనిషినని ప్రకటించుకున్నారు. ఇక మరొక కీలక నేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఎన్నికలకు ముందు ఎన్నో సమీకరణాలు వేసుకుని జనసేనలో చేరిన ఆయనకు పవన్ విశాఖ పార్లమెంట్ టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ 2.8 లక్షల పైచిలుకు ఓట్లు సాధించారు. కానీ ఆయన మాత్రం పవన్ సినిమాల్లోకి వెళ్లడం ఇష్టంలేదని అంటూ జనసేనకు రాజీనామా చేశారు. ఆతర్వాత ఆయన వైసీపీలోకి వెళతారని, బీజేపీలో చేరతారని వార్తలు వచ్చినా ఎటూ వెళ్లకుండా ఒంటరిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మళ్ళీ జనసేన వైపు చూస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. జనసేన బీజేపీతో జట్టుకట్టడం, కేంద్ర స్థాయి నేతలు కొందరు పవన్ కు పూర్తి మద్దతు ఇస్తుండటంతో లక్ష్మీనారాయణ తిరిగి జనసేనలో చేరాలని చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
అయితే లక్ష్మీనారాయణకు ఎప్పటికైనా విశాఖ ఎంపీ సీటు గెలవాలనే దృఢమైన కోరిక ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడ అక్కడి నుండే పోటీకి దిగాలనే కోరికతో ఉన్నారు. కాబట్టి పవన్ మరోసారి విశాఖ టికెట్ హామీ ఇస్తే జనసేనలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టు సంకేతాలు పంపుతున్నారట. నిజానికి ఆయన జనసేనలోనే ఉండి ఉంటే పవన్ ఆయనకు మంచి ప్రాధాన్యం ఇచ్చి ఉండేవారు. విశాఖలో మళ్ళీ ఆయన్నే నిలబెట్టేవారు. మరి ఒకసారి చిన్న సాకు చెప్పి షాకిచ్చి వెళ్ళిపోయిన లక్ష్మీనారాయణను మరోసారి పార్టీలోకి ఆహ్వానిస్తారో లేదో చూడాలి.