వాలంటీర్లే వైసీపీకి స్ట్రాంగ్ పిల్లర్స్.?

 

volunteers-strong-pillars-for-ysrcp

పార్టీ కార్యకర్తల సంగతెలా వున్నా, వాలంటీర్లను ఉద్దేశించి పదే పదే ప్రశంసిస్తుంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాజాగా, ఉగాది నేపథ్యంలో గ్రామ వాలంటీర్లను సత్కరించి, వారికి నగదు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలోనూ వాలంటీర్లపై ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించేశారు వైఎస్ జగన్. ‘పళ్ళున్నచెట్టుకే రాళ్ళ దెబ్బలు’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు, వాలంటీర్ల మనసుల్ని టచ్ చేశాయన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. నిజానికి, వాలంటీర్లుగా ఎక్కువమంది వైసీపీ కార్యకర్తలే పనిచేస్తున్నా, ఇతర పార్టీలకు చెందిన యువతీయువకులు కూడా వాలంటీర్లుగా సేవలందిస్తున్నారన్నది నిష్టుర సత్యం.

అధికారంలో వైసీపీ వుంది గనుక, ఆ పార్టీ అర్హులైతన తమ కార్యకర్తలకు ప్రత్యేకంగా అవకాశాలు కల్పించుకుంటే అది తప్పెలా అవుతుంది.? అన్న వాదనా లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. సంక్షేమ పథకాల్ని సామాన్యులకి అందించేందుకు వాలంటీర్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా ఉపయోగపడుతోంది. అదే సమయంలో, ఎన్నికలొచ్చినప్పుడు కూడా అధికార పార్టీకి ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా ఉపయోగపడుతోందన్న విమర్శలు లేకపోలేదు. సుమారు రెండున్నర లక్షల మంది వాలంటీర్లంటే చిన్న విషయం కాదు. అందరూ వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తారని అనుకోలేంగానీ, మెజార్టీ వాలంటీర్లు.. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. అదే వైసీపీకి కావాల్సింది కూడా. విపక్షాలు, వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేసిన ప్రతిసారీ, వాలంటీర్లు మరింతగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయడం జరుగుతోందన్నది గ్రామ స్థాయిలో వినిపిస్తోన్న ప్రచారం తాలూకు సారాంశం. ఎలా చూసినా, ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వాలంటీర్లు స్ట్రాంగ్ పిల్లర్స్ అని చెప్పక తప్పదేమో.