వాలంటీర్లా.? వైసీపీ కార్యకర్తలా.? చెరిపేసుకోలేని మచ్చ ఇది.!

Volunteers, Game Changers In AP Politics

Volunteers, Game Changers In AP Politics

రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది. ఇంటింటికీ వెళ్ళి సామాజిక పెన్షన్లు అందించడం, ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు సవ్యంగా అందేలా చూడటం.. ఇలా చాలా కార్యక్రమాల్ని అత్యంత చాకచక్యంగా వాలంటీర్లు నిర్వహిస్తున్నారు. తమది ఉద్యోగంగా వాలంటీర్లు కొందరు భావించినప్పటికీ, అది ఉద్యోగం కాదు.. సేవ.. దానికి ఫలితంగా గౌరవ వేతనం ఇస్తున్నామని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కాగా, వాలంటీర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకోసం సుమారు 200 కోట్ల రూపాయల ఖర్చుతో వాలంటీర్లకు నగదు ప్రోత్సాహకాల్ని ప్రకటించింది వైఎస్ జగన్ ప్రభుత్వం.

2 లక్షల మందికి పైగా లబ్దిదారులైన వాలంటీర్లకు ఈ మొత్తం ప్రకటించారు. 2 లక్షల మంది వాలంటీర్లున్నప్పుడు అందులో చిన్నా చితకా పొరపాట్లు సహజమే. అదే సమయంలో, వాలంటీర్లపై రాజకీయ పెత్తనమూ ఖచ్చితంగా వుండి తీరుతుంది. వాలంటీర్లు, పార్టీ కోసం పనిచేయాలనీ, వైసీపీకి ఓట్లేసేలా ప్రజలపై ఒత్తడి తీసుకురావాలని బెదిరిస్తోన్న అధికార పార్టీ నేతల వైనం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియో, ఆడియో టేపుల ద్వారా బయటపడుతోంది. అయితే, ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ పెద్దలు చొరవ చూపి, వాలంటీర్లు.. పార్టీలకతీతం.. అన్న భావనను కలగజేయలేకపోతుండడం ఆశ్చర్యకరమైన విషయం. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు.. ఇప్పుడు వైసీపీ హయాంలో వాలంటీర్లు.. అన్న భావనే కలుగుతోంది చాలామందికి.. వాలంటీర్లు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో. ’90 శాతం వాలంటీర్ పోస్టుల్ని వైసీపీ కార్యకర్తలకే ఇచ్చుకున్నాం..’ అని గతంలో వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఓ బహిరంగ వేదికపైనే వ్యాఖ్యానించిన దరిమిలా, ఆ మచ్చ చెరిపేసుకోవడం వైసీపీకి అంత తేలిక కాదు.

రాజకీయ పరమైన విమర్శలెలా వున్నా, వాలంటీర్ వ్యవస్థ అనేది అత్యుత్తమమైనది. కరోనా నేపథ్యంలో వాలంటీర్లు, సామాన్యులకు అండగా నిలిచారు. ప్రకృతి విపత్తుల వేళ కూడా వాలంటీర్ల సేవలు అద్వితీయం.