ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ మంగళవారం ఉదయం చెన్నై రామవరం గార్డెన్స్‌లో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అక్రమాస్తుల కేసులో తన నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసిన శశికళ.. సోమవారం కంచీపురం చేరుకోగా.. ఆమెకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తుండగా.. ఆమె కరోనా మహమ్మారి బారినపడ్డారు.
దీంతో ఆమె విక్టోరియా హాస్పిటల్‌లో చికిత్స తీసుకొని, జనవరి 31న డిశ్చార్జి అయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్న ఆమె జనవరి 27న ఆమెను జ్యుడీషియల్ కస్టడీ నుంచి అధికారికంగా విడుదల చేశారు. 2019లో ఆదాయపు పన్ను శాఖ ఆమెకు చెందిన రూ.1,600 కోట్ల విలువైన ఆస్తులను బినామీ లావాదేవీల చట్టం ప్రకారం అటాచ్ చేసింది.
సోమవారం ఉదయం 8 గంటలకు రిసార్టు నుంచి చెన్నైవైపు కారులోనే బయలుదేరారు. 10.45 గంటలకు ఆమె కారు తమిళనాడు సరిహద్దుల్లోకి ప్రవేశించగానే పోలీసులు ఆమె కారును అడ్డుకుని అన్నాడీఎంకే పతాకాన్ని తొలగించాలని కోరగా శశికళ నిరాకరించారు. అన్నాడీఎంకే తరపున పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఒక నేత ‘అది నా అధికారిక కారు, అడ్డుకునే హక్కు లేదు అని వాదించడంతో పోలీసులు వెనక్కితగ్గారు.