Vizag Steel : ఉక్కు సంకల్పం… కేంద్రాన్ని ప్రశ్నించలే ని చేతకానితనం

Vizag Steel :విశాఖపట్నం స్టీల్ ప్లాంటుని ప్రైవేటీకరణ చేస్తున్నదెవరు.? కేంద్ర ప్రభుత్వం. మరి, ప్రైవేటీకరణ వద్దంటూ నిలదీయాల్సిందెవర్ని.? ఇంకెవర్ని.. కేంద్ర ప్రభుత్వాన్నే. కానీ, రాష్ట్రంలో అధికార పార్టీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. ఇదే చిత్రమైన సందర్భం.

రాష్ట్రంలో జనసేన మాత్రమే ఇలాంటి రాజకీయాలు చేస్తోందనుకుంటే అది పొరపాటు. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీది కూడా ఇదే తీరు. చిత్రమేంటంటే, రాష్ట్రంలో అధికారంలో వైఎస్సార్సీపీ కూడా ఇలానే వ్యవహరిస్తోంది. రాష్ట్రం దాటి, కేంద్రాన్ని నిలదీసేంత ధైర్యం రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికీ, ఏ రాజకీయ పార్టీకీ లేదా.? అంటే, లేదనే చెప్పాలేమో.

పాడిందే పాటరా పాచి పళ్ళ డాష్ డాష్.. అన్నట్టు. ఒకటే పాట పాడుకోవాలి. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, రాజధాని, వెనుకబడిన ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజీ.. ఇలా చాలా అంశాలున్నాయి అందులో. ఏడున్నరేళ్ళుగా ఒకటే పాట. ఈ పాటలో మార్పులేమీ రావడంలేదు.

కొత్తగా, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ అంశం ఆ పాటలో వచ్చి చేరిందంతే. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో ఓ బహిరంగ సభ జరిగింది. రాయలసీమ మేధావులంటూ ఈరోజు తిరుపతిలో వైసీపీ కనుసన్నల్లో ఓ బహిరంగ సభ జరుగుతోంది.

అచ్చం వీటిల్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. విశాఖ కేంద్రంగా, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ఆయా రాజకీయ పార్టీలు ఎందుకు బహిరంగ సభల్ని నిర్వహించలేకపోతున్నాయి.? నిర్వహించినా, కేంద్రాన్నెందుకు ప్రశ్నించలేకపోతున్నాయి.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఎంపీల్ని ట్యాగ్ చేస్తూ, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణపై నిలదీయాలని జనసైనికులకు పిలుపునిచ్చారుగానీ, నిజానికి నిలదీయాల్సింది కేంద్రాన్ని, కేంద్ర మంత్రుల్ని, ప్రధాన మంత్రిని.