వైజాగ్ నాట్ ఫర్ సేల్.! స్టీల్ ప్లాంట్ సంగతేంటి.?

Vizag Not For Sale, What About Steel Plant?

Vizag Not For Sale, What About Steel Plant?

విభజన గాయాల నుంచి ఇంకా ఆంధ్రపదేశ్ రాష్ట్రం కోలుకోలేదు. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూనే వుంది. కేంద్రం నుంచి తగిన సాయం అందకపోవడంతో, అప్పులు చేయడం తప్ప రాష్ట్రాన్ని నడిపేందుకు ప్రభుత్వాలకు మరో మార్గం కనిపించడంలేదు. చంద్రబాబు హయాంలోనూ అప్పులు జరిగాయి.. వైఎస్ జగన్ హయాంలోనూ అప్పులు జరుగుతున్నాయి. వాస్తవానికి ధనిక రాష్ట్రం తెలంగాణ సైతం అప్పులు చేయాల్సి వస్తోంది. కేంద్రం కూడా అప్పలు చేయక తప్పడంలేదు. ఇప్పుడిదంతా ఎందుకంటే, వైజాగ్ నాట్ ఫర్ సేల్.. అంటూ భారతీయ జనతా పార్టీ పెద్ద ఉద్యమం చేయబోతోందట.

ఈ విషయాన్ని బీజేపీ నేత మాధవ్ సెలవిచ్చారు. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం, విశాఖలో విలువైన భూముల్ని అమ్మేయబోతోందనీ, దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామనీ అంటున్నారు. మంచి ఆలోచనే ఇది. కానీ, రాష్ట్రం ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేదెలా.? కేంద్రం, రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి, గాలికొదిలేసినప్పుడు రాష్ట్రం ఎలా మనుగడ సాధించాలి.? సరే, ప్రభుత్వ భూముల్ని అమ్మేస్తే భవిష్యత్తు ఏంటి.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. కానీ, కేంద్రం కూడా అమ్మకాలే చేస్తోంది కదా. విశాఖ స్టీలు ప్లాంటుని అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ‘కుదిరితే అమ్మేస్తాం.. కుదరకపోతే మూసేస్తాం..’ అంటూ కేంద్రం ఇప్పటికే స్పష్టతనిచ్చేసింది.

బీజేపీ చేస్తే సంసారం.. ఇంకెవరైనా చేస్తే వ్యభిచారమా.? అన్న ప్రశ్న ఇలాంటి సందర్భాల్లోనే ఉత్పన్నమవుతుంటుంది. ప్రభుత్వ భూములు, ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థలు.. ఇవన్నీ ప్రజల ఆస్తి. ప్రభుత్వం అదేదో గొప్ప అనుకుంటే పొరపాటే. ప్రజల్ని ఉద్ధరించడానికి ప్రజల ఆస్తుల్ని అమ్మేసి.. దాంతో తమ పబ్లిసిటీ చేసుకోవడం.. అనే ప్రక్రియకు ఎవరు తెరలేపినా అది తప్పే. అది రాష్ట్ర ప్రభుత్వం కావొచ్చు, కేంద్ర ప్రభుత్వం కావొచ్చు. ఎవరు చేసినా తప్పిదమే అది.