Virat Kohli : విరాట్ కోహ్లీ ఆ తప్పు చేయకపోయి వుంటే.!

Virat Kohli : టీమిండియా విక్టరీ సాధించింది. న్యూజిలాండ్ జట్టుని రెండో టెస్టులో ఓడించి సిరీస్‌ని కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్ డ్రా అవగా, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ని మట్టికరిపించింది. అయితే, ఈ విజయం పట్ల భారత క్రికెట్ అభిమానులు సంతోషంగా వున్నారా.? అంటే, లేరనే చర్చ సర్వత్రా జరుగుతోంది. క్రికెట్ విశ్లేషకులు సైతం, ‘ఇంతకంటే గొప్ప విజయాన్ని అందుకుని వుండాల్సింది’ అనే అభిప్రాయం క్రికెట్ విశ్లేషకుల నుంచి, అభిమానుల నుంచి వినిపిస్తోంది.

మొదటి మ్యాచ్ డ్రా అవడంలో న్యూజిలాండ్ తెగువకంటే, భారత బౌలర్ల నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపించింది. ఒకే ఒక్క వికెట్‌తో ఆ మ్యాచ్‌ని న్యూజిలాండ్ కాపాడుకుంది. సరే, క్రికెట్ అన్నాక ఇలాంటి అద్భుతాలు మామూలేనని సరిపెట్టుకోవచ్చు. అయినాగానీ, భారత బౌలర్లు ఇంకాస్త కష్టపడి వుంటే ఆ మ్యాచ్ మన ఖాతాలో పడి వుండేదే.

ఇక, రెండో టెస్ట్ విషయానికొస్తే, ఇక్కడ విరాట్ కోహ్లీ వైఫల్యం సుస్పష్టం. న్యూజిలాండ్ జట్టుని ఫాలో ఆన్ ఆడించి వుంటే, టీమిండియా ఇంకోసారి బ్యాటింగ్ చేసే అవకాశమే వచ్చేది కాదు. చాలా సందర్భాల్లో విరాట్ కోహ్లీ, ప్రత్యర్థి జట్టుని ఫాలో ఆన్ ఆడించే అవకాశం వచ్చినా, దాన్ని సద్వినియోగం చేసుకోకుండా విమర్శలకు తావిస్తుంటాడు.

ఇప్పుడూ అదే జరిగింది. న్యూజిలాండ్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగులు కూడా చేయలేక చేతులెత్తేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ మూడొందల పై మాటే. ఆ లెక్కన, చాలా తేలిగ్గా న్యూజిలాండ్ జట్టు మీద ఇన్నింగ్స్ విక్టరీ సాధించే అవకాశం టీమిండియాకి దక్కి వుండేది.

విరాట్ కోహ్లీ ఆలోచనల్ని కొందరు సమర్థిస్తోంటే, చాలామంది వ్యతిరేకించడం కొత్త విషయమేమీ కాదు. ఇన్నింగ్స్ విక్టరీ అనేది, ఏ జట్టుకి అయినా సరికొత్త బలాన్నిస్తుంది. కానీ, కోహ్లీ ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు ఒకింత ఆశ్చర్యకరమైన రీతిలో తీసుకుంటుంటాడు.. విమర్శలకు తావిస్తుంటాడు.