2020 సంవత్సరం దాదాపు కరోనాతో గడిచిపోయింది. ఆ మహమ్మారి ఎవరికి వచ్చింది, ఎలా సోకుతుంది, దాని బారిన పడకుండా ఉండాలంటే ఏమేం చేయాలి వంటి విషయాల గురించి తెలుసుకోవడమే సరిపోయింది. కరోనా వలన ఎనిమిది నెలల పాటు ప్రపంచం ఆగిపోయింది. అన్ని రంగాలు స్తంభించాయి. ప్రగతి రథచక్రాలకు బ్రేక్ పడ్డాయి. ఇన్ని అవాంతరాల మధ్య బిక్కబిక్కుమంటూ కాలం గడుపుతూ వస్తున్న జనాలు 2020 ఎప్పుడు గడుస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు 2020 పూర్తి కావడంతో 2021కు ఘన స్వాగతం పలికారు.
కరోనా కాలం నడుస్తున్నప్పటికీ, ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. భారత క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలు తమ సతీమణులతో కలిసి నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్నారు. గత ఏడాది న్యూ ఇయర్ వేడుకలను స్విట్జార్లాండ్‌లో ఎంజాయ్ చేసిన కోహ్లీ- అనుష్క లు ఈ సారి ఇండియాలోనే జరుపుకున్నారు. ప్రస్తుతం అనుష్క గర్భవతి కాగా, ఆమె జనవరిలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలోనే వారు ఎక్కడికి వెళ్లలేదు. కోహ్లీ కూడా పితృత్వ సెలవులు తీసుకొని ఆసీస్ తో టెస్ట్ సిరీస్ ఆడకుండా ఇండియాకు వచ్చాడు.
ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా క్రికెటర్ హార్డిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాన్‌కోవిక్‌తో పాటు మరికొంత మంది స్నేహితులు విరాట్ ఇంట్లో న్యూ ఇయర్ సందడి చేశారు. 2021కు ఘన స్వాగతం పలికారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన ఫొటోలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కోహ్లీ.. టెస్ట్‌లో నెగటివ్ వచ్చిన స్నేహితులు.. పాజిటివ్ సమయం గడిపారని కోహ్లీ ఆ పోస్టుకు కామెంట్ చేశాడు. సురక్షితమైన వాతావరణంలో స్నేహితులతో గడపడం కన్నా ఉత్తమమైనది ఏదీ లేదు. ఈ ఏడాది కొత్త ఆశల్ని, సంతోషాల్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నట్లు కోహ్లీ కోరుకున్నాడు. ఇంగ్లండ్ తో జరగనున్న టెస్ట్, టీ 20, వన్డే మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉండనున్నాడు.