తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగు మీద గట్టిగా దృష్టి పెట్టాడు. ఎలాగైనా ఇక్కడ స్థిరమైన మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనే తపనతో ఉన్నాడు. గతంలో పలుమార్లు ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. ఆయన సినిమాలు తమిళంలో హిట్ అయ్యేవే కానీ తెలుగులో తేలిపోయేవి. అందుకే ఆయన రెండేళ్ల క్రితం మంచి పీఆర్ బృందాన్ని టాలీవుడ్లో ఏర్పాటు చేసుకున్నారు. ఆ బృందం విజయ్ సినిమాలను తెలుగు సినిమాలే అనేంతలా ప్రచారం కల్పించారు. ‘మెర్సల్, బిగిల్, మాస్టర్’ చిత్రాలను మంచి విజయాలు సాధించేలా చేశారు. ఈ వరుస విజయాలతో ఆయన డబ్బింగ్ సినిమాల మీద తెలుగు ప్రేక్షకుల్లోనూ ఒక విధమైన క్రేజ్ ఏర్పడింది.
ఇక ఆయన కొత్త చిత్రం ‘బీస్ట్’ హడావుడి అయితే మామూలుగా లేదు. తమిళంలో ఎంత హంగామా అయితే ఉందో తెలుగులోనూ అలాగే ఉంది. ఉంది అనడం కంటే ఉండేలా చేశారు. ‘బీస్ట్’ ఫస్ట్ లుక్ మన వాళ్లకు బాగా నచ్చింది. మన పెద్ద హీరోల సినిమాలకు సోషల్ మీడియాలో ఎలాంటి జోరు అయితే కనిపిస్తుందో ఈ సినిమాకు అలాగే కనిపిస్తోంది. చూడబోతే ఈసారి విజయ్ రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ సాధించేలా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళం, హిందీలలో మల్టీలాంగ్వేజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన తెలుగు స్టార్ హీరోలకు పోటీ వచ్చేలా కనబడుతున్నాడు.