విజయశాంతి బీజేపీలో చేరబోతున్నారని ప్రతీరోజు ఏదో ఒక వార్త హడావిడి చేస్తూనే ఉంది. అయితే రాములమ్మను పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీజేపీ ఆమెతో చాలా లబ్ది పొందాలని చూస్తోందని టాక్. అందుకే విజయశాంతికి బీజేపీ ఈరేంజ్‌లో హైప్ క్రియేట్ చేస్తోందని సమాచారం. తెలంగాణతో పాటు తమిళనాడులో కూడా విజయశాంతి ఇమేజ్ ను పార్టీకోసం వాడుకోవాలని భావిస్తున్నారట కమలనాథులు. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి త్వరలో బీజేపీ గూటికి చేరడం ఖాయమని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ…తెలంగాణలో బీజేపీ బలపడిందంటూ ఆమె ట్వీట్లు చెయ్యడమే ఇందుకు సాక్ష్యం అని అంటున్నారు.
విజయశాంతి ఘర్‌వాపసీ వెనుక కాషాయ అధిష్టానానికి పెద్ద స్ట్రాటజీలున్నాయని సమాచారం. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. జయలలిత మరణంతో అన్నాడీఎంకే పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఈ స్థానంలో బీజేపీ బలపడాలని కమలం పార్టీ వ్యూహం. స్టార్ క్యాంపైనర్ల కోసం వెతుకుతున్న బీజేపీ ఈపాటికే కాంగ్రెస్ నాయకురాలు కుష్బూకు కాషాయకండువా కప్పేశారు. మరికొంత మంది కాంగ్రెస్, అన్నాడీఎంకే నేతలను చేర్చుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
తమిళం సైతం అనర్గళంగా మాట్లాడే రాములమ్మను పార్టీలోకి ఆహ్వానిస్తే ఆమె ఆవేశపూరిత ప్రసంగాలతో అరవ ఓట్లు రాబట్టవచ్చని భావిస్తోంది బీజేపీ. ఇటు తెలంగాణలోనూ బీజేపీకి కొంత పవర్‌ఫుల్ వాయిస్ దొరికినట్టవుతుందని భావిస్తోంది. అటు తమిళనాడులో, ఇటు తెలంగాణలోనూ విజయశాంతిని ఆయుధంగా వాడుకోవచ్చని బీజేపీ భావిస్తుంటే, అటు కేంద్రంలో లేదంటే ఇటు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట కీలమైన నాయకురాలిగా ఎదగొచ్చని రాములమ్మ భావిస్తున్నారు. దీంతో ఆమె చేరిక ఉభయతారకం కాబోతోందని సమాచారం.