విశాఖ వరుస ఘటనలలో విజయసాయి హస్తం ఉందా?

ఏపీలోని విశాఖలో జరుగుతున్న వరుస ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఎల్జీ పాలిమర్స్, సాయినార్ కెమికల్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలు మరువకముందే మొన్న రాత్రి రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.అయితే ఈ సంఘటనలు ప్రమాదవశాత్తు జరుగుతున్నాయా లేక ఎవరైనా వెనక నుంచి ఇలా నడిపిస్తున్నారా అనేది అర్ధం కావడం లేదు.

అయితే ఈ వరుస ఘటనలకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్నారు. నిన్న వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఈ వరుస ప్రమాదాలపై సమగ్రంగా విచారణ జరపాలని సీఎం జగన్‌ని కోరారు. విశాఖకు రాజధాని రాకుండా చేయాలని చంద్రబాబు, టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే నేడు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా ఈ వరుస ఘటనలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై అనుమానాన్ని వ్యక్తం చేశారు.

విశాఖలో జరిగే ప్రతి సంఘటనలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హస్తం ఉందని, విశాఖను జగన్ చేతిలో పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో రాంకీ కంపెనీకి అనుమతులు ఎందుకిచ్చారని నిలదీశారు. వైసీపీ అసమర్థపాలన కప్పిపుచ్చుకునేందుకు విజయసాయి చంద్రబాబు గురుంచి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు విజయసాయి ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.